పవన్ కల్యాణ్ నోటికి ముందుగానే తాళాలు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలవడానికి ముచ్చటపడుతున్నారని, ఈ మేరకు ఆయనకు ఆహ్వానం కూడా అందిందని.. వీరిద్దరూ ఎప్పుడు భేటీ అవుతారనేది త్వరలోనే నిర్ణయం అవుతుందని రెండు మూడురోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రధానంగా ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యను పవన్ కల్యాణ్ ఎక్కువగా ప్రస్తావిస్తున్నందున దానిపై ఆయనతో చర్చిస్తారని అంటున్నారు.

అలాగే అధికారికంగా కాకపోయినా.. కాపుల రిజర్వేషన్ అంశం, కాపు యువత ముద్రగడ ప్రభావంలో పడి పెడదోవ పట్టిపోకుండా చూడాల్సిన ఆవశ్యకత గురించి కూడా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ తో చర్చించే అవకాశం పుష్కలంగా ఉంది. ఇలాంటి సినేరియోలో... పవన్ తో భేటీ కావడానికంటె ముందే... చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ఆయన నోటికి తాళాలు వేసేశారు. మంగళవారం నాటి కేబినెట్ సమావేశం సాక్షిగా చంద్రబాబు తదనుగుణమైన నిర్ణయాలు తీసుకున్నారు. 

ఒకరకంగా చెప్పాలంటే కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు ఏమీ లేవు. ప్రధానంగా బెల్టుషాపులు తొలగించడం గురించే నిర్ణయించారు. బెల్టుషాపు అంటేనే అక్రమంగా ఏర్పాటైన షాపు కింద లెక్క. దాన్ని తొలగించడానికి ఇప్పుడు ఆదేశాలు జారీ చేయడం అంటే.. మరి ఈ మూడేళ్లుగా ఈ విషయంలో ఎంత ఘోరమైన ధృతరాష్ట్ర పాలన నడుస్తున్నదో అర్థం చేసుకోవాలి. 

పవన్ నోరెత్తకుండా....

ఈ కేబినెట్ భేటీ పవన్ ఫ్యాక్టర్ కు పెద్దపీట వేసినట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు ముద్రగడ పాదయాత్ర పేరుతో ప్రభుత్వ వర్గాల్లో గుబులు పుట్టిస్తుండగా.... పవన్ తో భేటీ అయి... ఆయన ద్వారా ప్రభుత్వ అనుకూల ప్రకటనలు ఇప్పించినట్లయితే.. ప్రజల్ని కొంత మేర మాయ చేయవచ్చుననే వ్యూహంతో చంద్రబాబునాయుడు కొన్ని నిర్ణయాలు చేసినట్లుగా కనిపిస్తోంది. ఉద్ధానం కిడ్నీ బాధితులకు పింఛను నిర్ణయం, ఇక్కడ పరిశోధనలకు శ్రీకారం, ఆర్వో ప్లాంటుల ఏర్పాటు వంటి నిర్ణయాలు కొత్తవేమీ కాదు. కాకపోతే పవన్ ను తృప్తి పరచడానికి అన్నట్లుగా తాజా నిర్ణయాల బిల్డప్ ఇచ్చారు.

మంజునాథ కమిషన్ వీలైనంత త్వరగా కాపులను బీసీల్లో చేర్చడానికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని కోరుతూ మంత్రివర్గం తీర్మానించింది. ఇదెంత మాయో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే.. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరుతున్నాం అనే మాట పాలకుల నుంచి కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. దీనిని మళ్లీ ప్రత్యేకంగా కేబినెట్ తీర్మానం కింద ప్రకటించడం అంటే.. అది కూడా పవన్ కల్యాణ్ ను దువ్వడానికే అని పలువురు భావిస్తున్నారు.

ముద్రగడ పాదయాత్రలోగా.. పవన్ కల్యాణ్ తో ప్రభుత్వ అనుకూల ప్రకటనలు చేయించుకోగలిగితే.. ప్రభుత్వానికి లాభం ఉంటుందని వారు రకరకాల ఎత్తులు వేస్తున్నట్లుగా కేబినెట్ చర్చలను లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Show comments