ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఈ రోజు చర్చ జరగనుంది. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం వుంది. ఇదీ, రాష్ట్ర రాజకీయాల్లో రాజ్యసభలో జరిగే పరిణామాలపై జరుగుతున్న చర్చ తాలూకు సారాంశం. అయితే, అసలు మేటర్ అది కాదు. చర్చ ప్రత్యేక హోదాపై కాదు.. జరిగే చర్చలో ప్రత్యేక హోదా అనేది ఓ అంశం మాత్రమే కావొచ్చు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం - అమలు అనే అంశం చుట్టూనే సుమారు రెండు గంటలపాటు చర్చ జరుగుతుంది. ఇదీ అసలు విషయం. అందరికీ తెలిసిన విషయమే, విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం అనేది లేదని. సో, కాంగ్రెస్ పార్టీనో, టీడీపీనో, వైఎస్సార్సీపీనో గట్టిగా గింజుకుంటే తప్ప, ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ జరిగే అవకాశాలు దాదాపుగా లేనట్లే. పైగా, ఎవరన్నా ఆ అంశాన్ని ప్రస్తావించినా, దాన్ని ఎలా టా'కిల్' చెయ్యాలో భారతీయ జనతా పార్టీకి తెలుసు.
ప్రత్యేక హోదా ఆర్థిక అంశాలతో ముడిపడి వున్న అంశం.. అని ఇప్పటికే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పేసిన దరిమిలా, ప్రత్యేక హోదాపై చర్చ జరిగినా కేవీపీ ఈ అంశంపై ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ జరిగే అవకాశమే లేదు. ఈ విషయం పక్కాగా తెలుసుకున్న టీడీపీ, ఒక వేళ ఓటింగ్ జరిగితే అనుకూలంగా ఓటేస్తామంటూ ఇప్పుడు హంగామా చేస్తోంది. ఇదే టీడీపీ, నిన్న మొన్నటిదాకా 'ప్రత్యేక హోదా అనేది సర్వరోగ నివారిణి కాదు' అంటూ బీజేపీతో కలిసి వంత పాడిన మాటను ఎలా మర్చిపోగలం.?
ఇక, కేంద్ర మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి, 'కేంద్రం గడచిన రెండేళ్ళలో చాలా చేసింది.. కొన్ని విషయాల్లో మాత్రం మాక్కూడా అసంతృప్తి వుంది..' అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. బ్యాలన్స్ షీట్ ప్రవేశపెడతామని సెలవిచ్చారు. అంటే, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాకుండా, ఎన్డీయే కూటమి ప్రయోజనాలే పరామవధిగా టీడీపీ చర్యలు వుండబోతున్నాయన్నమాట.
అన్నట్టు, ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని ఒకటికి పదిసార్లు పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రకటించేసింది. ఇప్పుడూ అదే మాట చెప్పబోతోంది. అంతకు మించి, ప్రత్యేక హోదాపై జరగాల్సిన రీతిలో చర్చ జరిగి, సానుకూల ఫలితాలు రాజ్యసభ ద్వారా వస్తాయని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి వుండదు. ఇదే సభలో, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్, ప్రత్యేక హోదా హామీ ఇచ్చినా.. విలువలకు వలువలూడ్చేసిన మోడీ సర్కార్ నుంచి.. ప్రత్యేక హోదాపై సానుకూల స్పందన ఎలా వస్తుంది.? ఛాన్సే లేదు.