కేసీఆర్ సూపర్ సక్సెస్.. బాబు ఫెయిల్?

సర్వజన సర్వే.. ఇది గతంలో ఒకసారి పతాక శీర్షికలకు ఎక్కింది, ఇప్పుడు మరోసారి తెలుగు వాళ్ల మధ్యన చర్చనీయాంశంగా మారింది. మొదటి సారి తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ సర్వజనుల సర్వే ఒకటి చేయించారు. అప్పట్లో ఆ సర్వే ఎందుకు? అనేదానిపై పెద్ద చర్చ, తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ప్రత్యేకించి హైదరాబాద్ లోని సీమాంధ్రుల నుంచి, తెలుగుదేశం వైపు నుంచి ఈ విషయంలో తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఒక్క రోజు సెలవు ప్రకటించి, ప్రభుత్వాధికారులందరినీ రంగంలోకి దించి రికార్డు స్థాయి వేగంతో సర్వేను పూర్తి చేయించాడు తెలంగాణ ముఖ్యమంత్రి.

సర్వే ఎందుకు? అనే విషయాన్ని, దానిపై వచ్చిన విమర్శలను పక్కనపెడితే, ఒక్క రోజులో అంతపనిని పూర్తి చేయించడం తెలంగాణ ప్రభుత్వ సమర్థతకు నిదర్శనంగా నిలిచింది. ఇక అప్పట్లో అలాంటి సర్వేపై తీవ్రమైన విమర్శలు చేసిన తెలుగుదేశం వాళ్లు ఇప్పుడు ఏపీలో అదే పని చేయిస్తున్నారు. ఏపీలో కూడా ఇలాంటి సర్వే ఒకటి కొంతకాలం కిందట ప్రారంభం అయ్యింది. తెలంగాణలో కాకుండా.. దీన్ని ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్టుగా చేపట్టడంతోనే కథ కంచికి చేరింది. ఇప్పటి వరకూ ఈ సర్వే ఒక కొలిక్కి రాలేదు! ఏపీ ప్రభుత్వాధికారులు చాన్నాళ్ల కిందటే ఈ సర్వే కోసం రోడ్డున పడ్డారు. అయితే.. మొరాయిస్తున్న మిషనరీతో ఈ సర్వే ముందుకు వెళ్లడం లేదు!

ఇప్పుడు ఇదే సర్వే విషయంలో తెలుగుదేశం నేతల నుంచే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సర్వే వల్ల మనకు చెడ్డపేరు వస్తోందంటూ తెలుగుదేశం నేతలే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఆపేయాలని కూడా వారు కోరుతున్నారు! ప్రతిపక్షం నుంచి ఈ సర్వే పట్ల వస్తున్న విమర్శలు సరే సరి! మరి వేగవంతంగా సర్వేను చేయించడంలో ఫెయిలవ్వడంతో పాటు, ఈ సర్వే పట్ల సొంత పార్టీ వారికే సమాధానపరచలేక బాబు అడ్మినిస్ట్రేటర్ గా ఫెయిలయ్యాడని ఇప్పుడు వస్తున్న విమర్శల విషయంలో ఆయన అభిమాన వర్గం, ఆయనను గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా అభివర్ణించే వారు ఏమని సమాధానమిస్తారో! అది కూడా కేసీఆర్ తో పోలిక వస్తోందిప్పుడు!

Show comments