“సాక్షి’’ ఈడీపై జగన్ అభిమానుల గరంగరం!

రామచంద్రమూర్తి… సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్. ఒకప్పుడు ఈ హోదాలో సజ్జల రామకృష్ణా రెడ్డి ఉండేవారు. జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఉన్న ఎస్ఆర్కే రెడ్ గోల్డ్ సజ్జల దివాకర్ రెడ్డికి సోదరుడు. “సాక్షి’’లో రెడ్ గోల్డ్ కు వాటాలున్నాయి. జగన్ ఆస్తుల కేసులో కూడా రెడ్ గోల్డ్ అధినేత నిందితుడిగా ఉన్నట్టున్నారు. ఇటీవలే కోర్టు నుంచి సీబీఐ విచారణ నుంచి ఆయన మినహాయింపు పొందినట్టున్నారు. ఆవిర్భావం దగ్గర నుంచి ఈడీగా ఐదారు సంవత్సరాలు కొనసాగిన రామకృష్ణా రెడ్డి “అంతర్గత’ కారణాల రీత్యా ఆ పదవి నుంచి వైదొలిగి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనుల్లో ఉన్నారు. 

సజ్జల ఆ హోదా నుంచి వైదొలిగాకా కొన్ని నెలల పాటు ఆ హోదాలో ఎవరూ లేకుండానే బండి నడిచింది. ఆ తర్వాత కొంతకాలానికి రామచంద్రమూర్తిని ఆ హోదాలో పెట్టింది సాక్షి యాజమాన్యం. జర్నలిస్టుగా సుధీర్ఘ అనుభవం ఉన్న ఈయన గతంలో ఆంధ్రజ్యోతికి, హన్స్  ఇండియా, హెచ్ఎంటీవీ లకు ఎడిటర్ గా వ్యవహరించిన నేపథ్యం ఉన్న వారు. అంతేకాదు తెలుగుదేశం అధినేత, ఆయా సమయాల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు సన్నిహితుడిగా జర్నలిస్టిక్ సర్కిల్స్ లో పేరుపొందారీయన.

పై స్థాయిలో ఉన్న జర్నలిస్టులకూ రాజకీయ నేతలకూ పెద్ద తేడా కనిపించడం లేదు ఈ రోజుల్లో. పార్టీ లు మారిన ఎమ్మెల్యేల లాంటిది వీరి పరిస్థితి. ఏ రోటికాడ ఆ పాట పాడాలి. వెనుకటికి వేరే మీడియా సంస్థల్లో ఉన్నప్పుడు చంద్రబాబును ఒక రేంజ్ లో  ప్రశంసించారు రామచంద్రమూర్తి. ఈయన అభిమానం ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. చంద్రబాబు దేశానికి ప్రధానమంత్రి కావడమే కరెక్టు అనేంత వరకూ! మరి సాక్షిలో అజెండా ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు. బాబుకు సీఎంగా ఉండేంత అర్హత లేదు.. అనే  అజెండాతో పని చేసే పేపర్లో… ఆర్సీఎమ్ చంద్రబాబు అనుకూల అజెండాను అమలు చేస్తున్నాడు.. అనేది జగన్ అభిమానుల నుంచి వస్తున్న ఆరోపణ.

దీనికి వారు అనేక ఆధారాలు ప్రస్తావిస్తున్నారు. రామచంద్రమూర్తి చంద్రబాబు మనిషి అని వీరు అగ్రహోద్రిక్తులవుతున్నారు. మీడియా విషయంలో జగన్ కు  ఉన్న ఏకైక అండ, ఆశ సాక్షి మాత్రమే. ఆఖరికి అది కూడా చంద్రబాబు  ఏజెంట్ చేతిలో ఉండిపోతే ఎలా? అని సోషల్్ నెట్  వర్కింగ్ సైట్స్ లో వీరు ప్రశ్నిస్తున్నారు. ఇక “సాక్షి’’ టీమ్ ను కదిలిస్తే.. ఆర్సీఎమ్ పై ఆసక్తికరమైన కబుర్లు చెబుతారు. 

హన్స్ నెట్ వర్క్ నుంచి బయటకు వస్తూ.. ఈయన తనతో పాటు కొంతమందిని తెచ్చుకున్నాడని, ఎందుకూ కొరగాని వాళ్లకు భారీ జీతాలు సాక్షి యాజమాన్యం నుంచి ఇప్పిస్తున్నాడని, తన టీమ్ లో కొందరిని కొన్ని జిల్లాల్లో మంచి స్థాయిలో పెట్టి వారి జేబులు నింపుతున్నాడని సాక్షి లోచాలా యేళ్ల నుంచి పని చేస్తున్న వాళ్లు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం తెలుగు మీడియా ఎడిటర్ల స్థాయిలో ఉన్న వారెవరికీ లేనంత స్థాయి ప్యాకేజీని కూడా ఆర్సీఎమ్ పొందుతున్నాడని వీరు అంటున్నారు. అత్యంత భారీ ప్యాకేజీ అనేది వారి మాట.

ఇక ఆర్సీఎమ్ వీక్లీ కాలమ్ తీరును పరిశీలిస్తే.. అందులోనేమో చంద్రబాబు విధానాలపై విమర్శలు కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ జగన్ అభిమానులను అకట్టుకోలేకపోతున్నాడీయన.

Show comments