గుణశేఖర్‌కి న్యాయం జరుగుతుందా.?

'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాకి పన్ను మినహాయింపునిచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 'రుద్రమదేవి' సినిమాకి ఎందుకు పన్ను మినహాయింపు ఇవ్వదు.? అంటూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ప్రశ్నిస్తూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు గుణశేఖర్‌. ఆ లేఖ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. 

అయితే, 'రుద్రమదేవి' అంటే తెలంగాణకు చెందిన కథ అనీ, 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చరిత్ర.. అనే వాదన తెరపైకొచ్చింది. అసలు, గౌతమి పుత్ర శాతకర్ణి తెలుగోడే కాదన్న వాదన తెలంగాణ నుంచి వ్యక్తమవుతోందనుకోండి.. అది వేరే విషయం. ఎవరి వాదనలు ఎలా వున్నాసరే, ఇటు రుద్రమదేవి.. అటు గౌతమి పుత్ర శాతకర్ణి.. ఇద్దరూ తెలుగు నేలను పరిపాలించినవారే. 

ఇప్పుడంటే, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అనే రాష్ట్రాలున్నాయిగానీ.. ఒకప్పుడు ఇవేమీ లేవు కదా.! రెండూ చారిత్రక నేపథ్యమున్న సినిమాలే. రెండిటికీ తెలుగు నేలతో సంబంధం వుంది. కాబట్టి, పన్ను మినహాయింపు రెండు సినిమాలకూ ఇవ్వడం శ్రేయస్కరమే. తద్వారా ఇలాంటి సినిమాలకు ప్రోత్సాహం అందించినట్లవుతుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించకుండా వుండలేం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం, 'శాతకర్ణి'కి మినహాయింపునిచ్చి, 'రుద్రమదేవి'ని లైట్‌ తీసుకుంది. 

'రుద్రమదేవి'కి పన్ను మినహాయింపు ఇవవ్వడం ద్వారా ప్రభుత్వానికి పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. పైగా, తెలుగు సినీ పరిశ్రమలో ప్రాంతీయ విధ్వేషాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ఆస్కారమిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి తీరాల్సిందే. స్పందించకపోతే మాత్రం, తన పోరాటం ఉధృతమవుతుందని గుణశేఖర్‌ హెచ్చరిస్తున్నారు. 'రాష్ట్రం విడిపోతే తెలంగాణలో ప్రాంతీయ విధ్వేషాలొస్తాయన్నారు.. కానీ, ఇక్కడ జరుగుతున్నది వేరు.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సినీ పరిశ్రమ పట్ల వివక్ష కన్పిస్తోంది..' అంటూ గుణశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. 

గుణశేఖర్‌కి న్యాయం జరుగుతుందా.? అయిపోయిన పెళ్ళికి బాజాలెందుకు.? అంటూ చంద్రబాబు సర్కార్‌ లైట్‌ తీసుకుంటుందా.? వేచి చూడాల్సిందే. 

Show comments