మంత్రి నిజం చెప్పాడా? తెలుగును అవమానించాడా?

ఇతర రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు మాతృభాషల పరిరక్షణ కోసం ఏం చేస్తున్నాయనేది అలా పక్కకు పెడితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పాలకులు పనిగట్టుకొని తెలుగును హత్య చేస్తున్నారని భాషాభిమానులు వాపోతున్నారు. తెలుగును హత్య చేయడమంటే ఎలా? మాతృభాష మాట్లాడవద్దంటున్నారా? రాయవద్దంటున్నారా? అదేం కాదు. మాతృభాషలో చదువుకోవద్దంటున్నారు. ఎందుకు? మాతృభాషలో బడి చదువు, కాలేజీ చదువులు చదువుకుంటే ఉద్యోగాలు రావు. ఉద్యోగాల దాకా ఎందుకు? ముందు పోటీ పరీక్షల్లో పాస్‌ కాలేరు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ 'తెలుగు మీడియంలో చదివితే భవిష్యత్తు ఉండదు. ఇంగ్లిషు మీడియంలో చదివితేనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు' అని చెప్పారు. తెలుగు మీడియంలో చదువుకున్నవారికి ర్యాంకులు రావడంలేదన్నారు. అందుకే సర్కారు పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం పెడుతున్నామన్నారు. విద్యా వ్యాపారి అయిన నారాయణ వ్యాఖ్యలు తెలుగు భాషాభిమానులకు ఆగ్రహం కలిగిస్తాయి. కాని నారాయణ నిజం చెప్పాడా? తెలుగును అవమానించాడా? అనే కోణంలోనూ ఆలోచించాలి.

ఉన్నత చదువులు చదవాలంటే ప్రవేశపరీక్షలు రాయాలి. ఒకటి రెండు ప్రవేశపరీక్షలు ఇంగ్లిషుతో పాటు తెలుగులోనూ రాసే అవకాశం ఉన్నా ఎక్కువ ఎంట్రెన్స్‌లు ఇంగ్లిషులోనే ఉంటున్నాయి. కాలక్రమంలో ఎంట్రెన్సులన్నీ జాతీయ స్థాయిలో నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. ఆ ఎంట్రన్సుల్లో పాసయ్యే సామర్థ్యం మాతృభాషలో చదువుకున్న విద్యార్థులకు ఉండటంలేదు. ఎలాగోలా ఎంట్రన్స్‌ పాసయ్యి కోర్సుల్లో చేరితే ఇంగ్లిషు బోధన అర్థం కావడం చాలా కష్టం. ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏవో కొన్ని ఉద్యోగాలు ఇచ్చినా అక్కడా ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నవారికే ప్రాధాన్యం. ఇప్పుడంతా ప్రయివేటుమయం. ఉద్యోగాల కల్పనలో ప్రయివేటు రంగానిదే పైచేయి. పరిశ్రమల్లో, కంపెనీల్లో ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుకున్నవారికి ఉద్యోగాలు దొరుకుతాయి తప్ప సాధారణ డిగ్రీలు చేసినవారికి శూన్యహస్తమే.

ప్రొఫెషనల్‌ కోర్సులు ఇంగ్లిషులోనే చదవాలి. తెలుగు మీడియంలో చదువుకున్నవారికి ఏం ఉద్యోగాలు దొరుకుతున్నాయి? ఏమీ లేవు. ఒకప్పుడు నిజాం రాజ్యంలో ఉర్దూ మీడియంలో చదువుకున్నవరికే ఉద్యోగాలు దొరికేవి. బ్రిటిషువారి పాలనలో ఉన్న ప్రాంతాల్లో ఇంగ్లిషులో చదువుకుంటేనే ఉద్యోగాలు దొరికేవి. అంటే మాతృభాష కాకుండా పరాయి భాషల్లో చదివితేనే ఉపాధి దొరికేది. ఇప్పుడూ అదే పరిస్థితి ఏర్పడింది. తెలుగులో ఎంత పెద్ద పీజీ కోర్సు చేసినా ఏం ప్రయోజనం లేదు. తెలుగు మీడియంలో చదివితే ఉద్యోగాలు దొరకవనే విషయం కూలినాలి చేసుకునేవారికి కూడా తెలుసు. అందుకే రెక్కలు ముక్కలు చేసుకొని ఫీజులు కడుతూ ప్రయివేటు స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంలో చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలంటే తెలుగు మీడియంలోనే బోధన ఉంటుంది. ఈ మీడియంలో చదివేవారి సంఖ్య తగ్గుతుండటంతో వాటి నిర్వహణ భారమవుతోందని పాలకుల వాదన.

అందుకే వాటిల్లోనూ ఇంగ్లిషు మీడియం పెడితే ఫీజులు కట్టే శక్తిలేనివారు సర్కారు విద్యా సంస్థల్లోనే చదువుకుంటారని, తద్వారా ప్రయివేటు విద్యా సంస్థల్లోని విద్యార్థులతో పోటీ పడగలుగుతారని చెబుతున్నారు. తెలుగు మీడియంలో చదివించి తమ పిల్లల భవిష్యత్తు పాడుచేయచేయడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. ఇప్పుడు సమాజం రెండు వర్గాలుగా విడిపోయింది. తెలుగు మీడియం ఉండాలని, అది లేకపోతే బడుగు బలహీనవర్గాలవారికి అన్యాయం జరుగుతుందని వాదించేది ఓ వర్గమైతే, తెలుగు మీడియం కారణంగానే బడుగు బలహీనవర్గాలవారికి అన్యాయం జరుగుతోందని వాదించే వర్గం మరొకటి. అట్టడుగు వర్గాలవారికి ఇంగ్లిషు మీడియం చేరువ చేయాలని, సర్కారు పాఠశాలలను ఇంగ్లిషు మీడియం పాఠశాలలుగా మార్చాలని ఈ వర్గం డిమాండ్‌ చేస్తోంది. 

మాతృభాష పరిరక్షణ గురించి గుండెలు బాదుకుంటున్నవారు తమ పిల్లలను ఇంగ్లిషు మీడియంలోనే చదివిస్తున్నారని విమర్శిస్తున్నారు. విచిత్రమేమిటంటే మాతృభాష అనేది తెలుగు ప్రజలకు మాత్రమే గుదిబండగా మారింది. ఇతర రాష్ట్రాల్లో ఈ సమస్య కనబడటంలేదు. అక్కడి పాలకులు మాతృభాషలో చదువుకుంటే భవిష్యత్తు లేదని చెప్పడంలేదు. పైగా ఇంటర్మీడియంట్‌ వరకు మాతృభాష తప్పనిసరిగా ఓ సబ్జెక్టుగా చదవాల్సిందేనని కండిషన్‌ పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓనమాలు నేర్చుకోకుండా ఎంత పెద్ద చదువులైనా చదువుకోవచ్చు. తెలుగు మాట్లాడుతున్నంతకాలం మాతృభాష జీవించిఉన్నట్లేనని ఇప్పటివారి భావన.

Show comments