ఫ్యాక్షన్‌.. రాజకీయం.. ఆ గ్లామరే వేరు.!

''భూమా నాగిరెడ్డిని చూస్తే సినిమా హీరోలా వుంటారు.. ఆయన గ్లామర్‌ అలాంటిది. ఎప్పుడూ చిరునవ్వుతోనే కన్పిస్తారు..'' ప్రజారాజ్యం పార్టీలో వున్నప్పుడు ఓ సందర్బంలో చిరంజీవి చెప్పిన మాట అది. 'భూమా నాగిరెడ్డితో కాస్సేపు మాట్లాడితే కొత్త ఉత్సాహం వస్తుంది..' అని చాలా సందర్భాల్లో చెప్పారాయన. 

చాలామందికి భూమా నాగిరెడ్డి పొలిటికల్‌ లీడర్‌లానే తెలుసు. కానీ, కర్నూలు జిల్లాలో ఆయన చాలామందికి ఫ్యాక్షనిస్ట్‌గా కూడా పరిచయం. ఆళ్ళగడ్డలో భూమా వర్గం ఫ్యాక్షన్‌ రాజకీయాల్ని నడిపింది. అనుకోకుండా ఫ్యాక్షన్‌లోకి రావాల్సి వచ్చిందాయకి. తండ్రి నుంచి వారసత్వవంగా ఫ్యాక్షనిజం ఆయనకు దక్కిందనొచ్చేమో. తండ్రి మరణంతో భూమా లైఫ్ కొత్త మలుపు తిరిగింది. ఆ తర్వాత సోదరుడి మరణంతో ఇంకో ట్విస్ట్. నమ్ముకున్నవారికి నాయకుడు, ప్రత్యర్థులకు ఫ్యాక్షన్ లీడర్.. ఇదీ భూమా నాగిరెడ్డి గురించి కర్నూలు జిల్లాలో చెప్పేమాట. ఫ్యాక్షన్‌ రాజకీయాల్ని నడిపినా, రాజకీయాల్లో 'గ్లామర్‌' వున్న లీడర్‌గా భూమా నాగిరెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు. 

మూడుసార్లు ఎంపీగా పనిచేయడం, పలుసార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం అంటే చిన్న విషయం కాదు కదా.! మంత్రి పదవి దక్కుతుందనేంతలోపు.. ఇదిగో ఇలా ఎవరూ ఊహించని విధంగా గుండెపోటుతో భూమా నాగిరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. నిన్ననే, ముఖ్యమంత్రి చంద్రబాబుతో 'మంత్రి పదవి' విషయమై భూమా నాగిరెడ్డి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. తనకు లేదా తన కుమార్తెకు మంత్రి పదవి తెచ్చుకోవాలనే పట్టుదలతో వున్నారాయన. నిజానికి ఏడాది క్రితం, మంత్రి పదవి ఎరగా వేసి చంద్రబాబు - భూమా కుటుంబాన్ని టీడీపీలోకి లాక్కొచ్చిన విషయం విదితమే. ఇదిగో.. అదిగో.. అంటూ ఏడాదిగా కాలయాపన చేసేశారు చంద్రబాబు. 

ఈలోగా జిల్లాలో భూమా వర్గానికి, టీడీపీ నేతల నుంచి పలుమార్లు అవమానాలు ఎదురయ్యాయి. ఆ అవమానాల్ని దిగమింగుకుంటున్నప్పటికీ, 'ఒత్తిడి' అనేది సహజం కదా. ఆ ఒత్తిడిలోనే, భూమా నాగిరెడ్డి గుండెపోటుకి గురయ్యారన్న వాదనలు భూమా అనుచరుల నుంచి విన్పిస్తున్నాయి. ఎవరి వాదనలెలా వున్నాసరే, కర్నూలు జిల్లా ఓ ముఖ్య నేతను కోల్పోయింది. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పగల సత్తా వున్న భూమా లేని లోటు పూడ్చలేనిదని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు చెబుతుండడం గమనార్హం.

Readmore!

Show comments

Related Stories :