సినిమాలపై బ్యాన్‌ ఎత్తేశారు

పాపాల పాకిస్తాన్‌ పట్టుదలకు పోయి, అక్కడి సినీ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేసుకుంది. భారతీయ సినిమాల్ని పాకిస్తాన్‌లో నిషేధించడం ద్వారా, అక్కడ చాలామంది నిర్మాతల పొట్ట కొట్టేసింది. దాంతో, పాకిస్తాన్‌లో సినీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ మాటకొస్తే, బారతీయ సినిమాలపై పాకిస్తాన్‌లో బ్యాన్‌ అనేది సర్వసాధారణమైన విషయమే. అయినాసరే. ఇండియన్‌ సినిమాకి అక్కడున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌ సినిమాలు ఇండియాతోపాటు సైమల్టేనియస్‌గా పాకిస్తాన్‌లోనూ విడుదలవుతాయి. అలా బాలీవుడ్‌ సినిమాలకి పాకిస్తాన్‌లో మంచి మార్కెట్‌ వుంది. 

తమ సినిమాలపై పాకిస్తాన్‌ బ్యాన్‌ విధించడంతో కొన్ని సినిమాలు కాస్త ఇబ్బందిపడిన మాట వాస్తవం. ఇండియా - పాకిస్తాన్‌కి చెందిన నటీనటులు కలిసి సినిమాల్లో నటిస్తోన్న తరుణంలో ఇండియా - పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం ఒక్కసారిగా పరిస్థితుల్ని మార్చేసింది. ఈసారి ఈ పరిస్థితులు మళ్ళీ సద్దుమణిగే అవకాశం లేదని అంతా అనుకున్నారు. కానీ, పాకిస్తాన్‌ పంతం తగ్గించుకుంది. అక్కడ భారతీయ సినిమాల విడుదలకు మళ్ళీ రంగం సిద్ధమయ్యింది. రేపట్నుంచి పాకిస్తాన్‌లో భారతీయ సినిమాలు ప్రదర్శితమవుతాయి. 

'బాలీవుడ్‌ సినిమాల్ని పాకిస్తాన్‌లో విడుదల చేయకపోవడం వల్ల మాకు కలిగే నష్టం చాలా తక్కువే. అది అసలు నష్టమే కాదు. లాభాల్ని తగ్గించుకోవాల్సి వస్తుందంతే.. పాకిస్తాన్‌కి అలా కాదు. అక్కడ బాలీవుడ్‌ సినిమాలకి క్రేజ్‌ చాలా ఎక్కువ. నష్టపోయేది అక్కడి నిర్మాతలు, ప్రేక్షకులే..' అంటూ పాకిస్తాన్‌లో తమ సినిమాల విడుదలపై బ్యాన్‌ విషయమై బాలీవుడ్‌ సినీ జనం గతంలో స్పందించిన విషయం విదితమే. 

ఎలాగైతేనేం, పాకిస్తాన్‌లో బారతీయ సినిమాల ప్రదర్శనకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. మరి, పాక్‌ నటీనటులు నటించిన బాలీవుడ్‌ సినిమాలు మన దేశంలో యధాతథంగా విడుదలవుతాయా.? ఇదై ప్రస్తుతానికి సస్పెన్సే.

Show comments