ఈ వయసులో రాజీనామాలా, ఏం సాధించేందుకు!

మొన్న ఎన్డీ తివారీ, నిన్న ఎస్ఎం కృష్ణ.. కాంగ్రెస్ కురు వృద్ధుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన దగ్గర నుంచి ఇలాంటి రాజీనామాలు నమోదవుతూనే ఉన్నాయి. అధికారం కోల్పోయిన కాంగ్రెస్ లో ఉండలేమన్నట్టుగా రాజీనామాలు చేస్తున్నారు నేతలు. ఇలాంటి వారిలో యూపీఏ హయాంలో కేంద్రమంత్రి పదవులను, గవర్నర్ పదవులను అనుభవించిన వారు ఉండటంతో వీరంతా మిక్కిలి స్వార్థ పరులు అనుకోవాల్సి వస్తోంది.

తాజాగా రాజీనామా చేసిన ఎస్ఎం కృష్ణ కు 50 యేళ్ల పాటు కాంగ్రెస్ లో పనిచేసిన అనుభవం ఉంది! ఈ యాభై ఏళ్లలో ఆయన కాంగ్రెస్ ఎంతో ఎదిగాడు. దేశంలోనే గుర్తింపు పొందిన రాజకీయ నేత అయ్యాడు. కర్ణాటక మంత్రి, ముఖ్యమంత్రి, భారత విదేశాంగ శాఖ మంత్రి, మహారాష్ట్ర గవర్నర్ వంటి పదవులను పొందాడు కృష్ణ. ఇదే సమయంలో వ్యక్తిగతంగా ఈయనకు క్లీన్ రికార్డు ఉంది.

బెంగళూరు ప్రాధాన్యతను పెంచిన కర్ణాటక ముఖ్యమంత్రిగా పేరుంది. ఒక దశలో కర్ణాటక రాజధానిగా బెంగళూరు వేస్టు, మైసూర్ ను రాజధానిగా మార్చాలనే డిమాండ్ వినిపిస్తున్న వేళ.. సీఎం హోదాలో ఆ డిమాండ్ కు వ్యతిరేకంగా.. బెంగళూరు అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి కృష్ణ. కర్ణాటకలోని మిగతా కాంగ్రెస్ నేతలతో పోలిస్తే.. చదువుకున్న వ్యక్తి, ఆలోచన పరుడు కృష్ణ. అందుకే ఈయనకు కాంగ్రెస్ కీలకమైన విదేశాంగ శాఖ బాధ్యతలు కూడా అప్పగించింది.

ప్రస్తుతం కృష్ణ వయసు 84 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడీయన. రాజీనామా ఎందుకు చేసినట్టో.. ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తాడట! మరి వినాలి ఎందుకో!

Show comments