అప్పుడు జేసీ...ఇప్పుడు రాయపాటి...!

రాజకీయ నాయకులు జ్యోతిష్యులు కారు. కాని అప్పుడప్పుడు వారు ఫలానా విషయం జరుగుతుందనో, జరగదనో చెబుతుంటారు. అందుకోసం వారేమీ లెక్కలు వేయరు. గ్రహాల స్థితిగతులు చూడరు. తమకు అందిన సమాచారాన్ని బట్టి ఓ విషయం మీద నెగిటివ్‌గానో, పాజిటివ్‌గానో చెబుతుంటారు. కొందరు అలా పదేపదే చెప్పిన జ్యోతిషంవంటి విషయాలు నిజమవుతుంటాయి. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మొదటినుంచి 'ఏపీకి ప్రత్యేక హోదా రాదు' అని చెబుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ, బీజేపీ నాయకులంతా ప్రత్యేక హోదా వస్తుందని ప్రజలను ప్రలోభపెడుతున్న సమయంలో జేసీ దివాకర్‌ రెడ్డి ఒక్కడే ప్రత్యేక హోదా రాదనే మాటకు కట్టుబడి అదే విషయం చెప్పారు. చివరకు ఆయన చెప్పినట్లే జరిగింది. చాలామంది 'పచ్చ' నాయకులు చంద్రబాబు కటాక్షవీక్షణాల కోసం బాబు ప్రత్యేక హోదా సాధిస్తారని, అది ఆయనవల్లనే సాధ్యమవుతుందని, హోదా కోసం ఎంత దూరమైనా వెళతామని...ఇలా ఏవో కబుర్లు చెప్పారు. బీజేపీ నాయకుల ప్రచారమూ ఇదే టైపు. ఒకరు బాబు భజన. మరొకరు మోదీ స్తోత్రం. ఈ నేపథ్యంలో జేసీ ఒక్క మాట మీదనే ఉన్నారు తప్ప మరోవిధంగా మాట్లాడలేదు.

జేసీ తన రాజకీయ మనుగడ కోసం టీడీపీలోకి వచ్చారే తప్ప చంద్రబాబు మీద విపరీతమైన అభిమానం. ప్రేమ ఉన్నాయనుకోలేం. గత్యంతరం లేకనే టీడీపీలోకి వచ్చానని ఓ బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలోనే చెప్పారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ  ఓసారి పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీలు ధర్నా చేసిన సందర్భంలో 'ఇదంతా పవన్‌ కళ్యాణ్‌ను సంతృప్తిపరిచేందుకు చేస్తున్నాం. హోదా వస్తుందని కాదు' అన్నారు. అంతకుముందు పవన్‌ కళ్యాణ్‌ మీడియా సమావేశం పెట్టి హోదా కోసం టీడీపీ ఎంపీలు ఫైట్‌ చేయడంలేదని దుమ్మెత్తిపోశాడు. దీంతో నామమాత్రంగా పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులు పట్టుకొని కొద్దిసేపు ధర్నా చేశారు. ప్రత్యేక హోదా రాదనే విషయం ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి కూడా తెలుసునని ఆయన మీడియా సమావేశంలోనే చెప్పారు.

ఆయన ఓసారి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ప్రజల్లో సెంటిమెంటుగా మారింది కాబట్టి అది ఇవ్వకపోతే బీజేపీతోపాటు టీడీపీ కూడా ఎన్నికల్లో మునిగిపోతుందని తాను నేరుగా చంద్రబాబుకే చెప్పానని అన్నారు. ప్రత్యేక హోదా వస్తుందని ఎన్నికల ప్రచారంలో బీజేపీతో పాటు టీడీపీ కూడా ప్రజలను మభ్యపెట్టిందని నిర్మొహమాటంగా చెప్పారు. ఆనాడు మోదీ ప్రసంగాలకు తామంతా (టీడీపీ) చప్పట్లు కొట్టామన్నారు. మోదీ ఏనాడో టీడీపీని కరివేపాకులా తీసేశారని, ఆనాడు అధికారంలోకి రావడం కోసం టీడీపీతో జత కట్టారని, అధికారంలోకి వచ్చాక అవసరం తీరిపోయిందన్నారు. ఏది ఏమైనా జేసీ దివాకర్‌ రెడ్డి చెప్పింది నిజమైంది. అప్పుడు జేసీ దివాకర్‌ రెడ్డి మాదిరిగానే ఇప్పుడు కూడా టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు 'రైల్వే జోన్‌ ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా లేదు' అని తేల్చి చెప్పారు. 'ఈ విషయం మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుంది. అయినా మాట్లాడతా' అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబు భయపడే మాట వాస్తవమే. ఆ విషయం రాయపాటికి తెలుసు. చంద్రబాబు ప్రధాని మోదీని అనేకసార్లు కలిశారని, కాని రైల్వే జోన్‌ ఎందుకు ఇవ్వలేదు?' అని ప్రశ్నించారు.

చంద్రబాబుపై రాయపాటి చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. వచ్చే ఎన్నికలనాటికి ఆయన టీడీపీలో ఉందకపోవచ్చు లేదా రాజకీయాల నుంచి విరమించుకోవచ్చు. అందుకే చంద్రబాబుకు కోపం వచ్చినా తాను మాట్లాడతానని అన్నారేమో. రాయపాటి చెప్పిన జ్యోతిష్యం నిజం కావచ్చు. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి కదలికా లేదు. రైల్వే జోన్‌పై జరుగుతున్న సమావేశాల్లో భోజనాలు చేసి వెళ్లిపోతున్నారుతప్ప ఎలాంటి పనులూ జరగడంలేదని రాయపాటి చెప్పారు.  మూడేళ్ల తరువాత కూడా కేంద్ర మంత్రి  వెంకయ్య నాయుడు రైల్వే జోన్‌ సంక్లిష్టమైన వ్యవహారమని చెబుతున్నారంటే దీనికి 'రెడ్‌ సిగ్నల్‌' పడుతుందేమోనని అనుమానం కలుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయో తెలియదు. ప్రత్యేక హోదా పోయింది. చట్టబద్ధత, రైల్వే జోన్‌పై అనిశ్చితి. మొదటి ఏడాది రెవిన్యూ లోటు ఇంతవరకు పూర్తిగా భర్తీ చేయలేదు. బీజేపీ నాయకులు  మూడు విషయాలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒకటి పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు రుణం ఇప్పించడం. రెండు పోలవరం కింద మునిగిపోనున్న తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడం. కొన్ని కేంద్ర విద్యా సంస్థలను కేటాయించడం. రైల్వే జోన్‌ ఇవ్వకపోయినా చంద్రబాబు సర్దుకుపోతారు. అందులో సందేహమేమీ లేదు.అప్పుడు జేసీ...ఇప్పుడు రాయపాటి...!

Show comments