శశికళ ఆరాటం.. గవర్నర్‌ తాత్సారం.!

జారిపోతోంది.. జారిపోతోంది.. ముఖ్యమంత్రి పదవి చేజారిపోతోంది.. ఇదీ అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఆవేదన. ఆ ఆవేదనతోనే ఆమె, గవర్నర్‌పై లేఖాస్త్రం సంధించారు. ముఖ్యమంత్రి పదవికి పన్నీర్‌ సెల్వం రాజీనామా చేసి వారం రోజులయ్యిందనీ, ఆ రాజీనామా కూడా ఆమోదం పొందిందనీ, ప్రభుత్వ ఏర్పాటు కోసం తాము సిద్ధంగా వున్నామనీ, తమకు అవకాశం ఇవ్వాలనీ ఈ లేఖాస్త్రంలో పేర్కొన్నారు శశికళ. 

మామూలుగా అయితే, గవర్నర్‌ని బతిమాలుకోవడం తప్ప, గవర్నర్‌ని డిమాండ్‌ చేసే పరిస్థితి లేదెవరికీ. కానీ, అక్కడ పరిస్థితి వేరు. తాజాగా ఓ మంత్రి ఇప్పుడు తన వల నుంచి జారిపోయి, పన్నీర్‌సెల్వం గూటికి చేరడంతో శశికళలో ఆందోళన క్రమక్రమంగా పెరిగిపోతోంది. అసలంటూ ఒక్క ఎమ్మెల్యే అయినా పన్నీర్‌ సెల్వం వెంట వున్నారా.? అన్న పరిస్థితుల నుంచి, 10 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఓ మంత్రి.. ఇలా పన్నీర్‌ బలం పెరిగేదాకా పరిస్థితులు మారిపోయాయి. 

ఇదే ఇప్పుడు చిన్నమ్మ శశికళ టెన్షన్‌. ఆ టెన్షన్‌లోనే గవర్నర్‌కి ఆమె లేఖ రాసేశారుగానీ, ఇదిప్పుడు 'బెదిరింపు'గా మారి, ఆమెకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా వుంది. గవర్నర్‌ గనుక, తనకు అందిన లేఖని సీరియస్‌గా తీసుకుంటే, శశికళ వివాదంలో ఇరుక్కునట్టే. ఎందుకంటే, గవర్నర్‌పై ఇలాంటి విషయాల్లో విమర్శలు చేసేముందు, అల్టిమేటం జారీ చేసేముందు, తొందరపెట్టేముందు.. ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో గవర్నర్‌ తన విచక్షణాధికారాల్ని ఉపయోగిస్తే అంతే సంగతులు. 

గవర్నర్‌ వైపు నుంచి తాత్సారం సుస్పష్టం. కానీ, ఇప్పుడు గవర్నర్‌ని ప్రసన్నం చేసుకోవడం తప్ప శశికళకు ఇంకో మార్గం లేదు. రాజకీయానుభవం వుండి వుంటే, శశికళ ఇంత తొందరపాటుతో వ్యవహరించి వుండేవారు కాదేమో.!

Show comments