జడ్పీ ఛైర్మన్‌ పదవికై కుమ్ములాట!

తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్‌ అధ్యక్ష పదవి కోసం అధికార తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. అధికార మార్పిడి కోసం జరుగుతున్న ఈ వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. పార్టీ పరిశీలకుడు, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవికి కొత్త నేతను ఎంపిక చేసే వ్యవహారంపై జరిగిన చర్చ పార్టీ వర్గాల్లో కలకలం రెకెత్తించింది.

ప్రస్తుతం జడ్పీ ఛైర్మన్‌గా నామన రాంబాబు వ్యవహరిస్తున్న నేపథ్యంలో, అధికార మార్పిడి కోసం అధిష్టానం నడుం బిగించింది. పార్టీ సీనియర్‌ నేత రాంబాబు సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పట్లో జడ్పీ ఛైర్మన్‌ పదవి కోసం టీడీపీకి చెందిన మరో సీనియర్‌ నేత, ఐ పోలవరం జడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్‌కు సముదాయించి, పోటీ నుండి తప్పుకునేలా చేశారు.

ఇదిలావుంటే ఇటీవల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుండి తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్‌ను జడ్పీ ఛైర్మన్‌గా ఎంపిక చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. సాక్షాత్తూ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్‌, నవీన్‌కు ఛైర్మన్‌ పదవినిస్తామని హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది.

దీనిపై ప్రస్తుత జడ్పీ ఛైర్మన్‌ రాంబాబు తీవ్రంగా కలత చెందారు. ఈ నేపథ్యంలో మంత్రి కళా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన జిల్లా అధ్యక్షుని ఎన్నికల్లో జడ్పీ ఛైర్మన్‌ రాంబాబుకు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి పంపిక చేస్తూ నిర్ణయించారు. మరోవైపు ఐ పోలవరం జడ్పీటీసీ రాజశేఖర్‌ రంగ ప్రవేశం చేసి, గతంలో తనకిచ్చిన హామీని మరిచారా? అంటూ మంత్రి, జిల్లా పరిశీలకుడు కళావెంకట్రావును నిలదీశారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా జడ్పీ ఛైర్మన్‌ విషయంలో మార్పు తప్పడం లేదని, ఇటువంటి పరిస్థితుల్లో పార్టీకి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుత జడ్పీ ఛైర్మన్‌ రాంబాబు కూడా కళా వెంకట్రావును కలసి జడ్పీ ఛైర్మన్‌ పదవి నుండి తనను తప్పించడం ఇష్టంలేదని స్పష్టం చేశారు. జడ్పీ ఛైర్మన్‌తో పాటు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా రెండు పదవుల్లో కొనసాగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు జగ్గంపేట జడ్పీటీసీ జ్యోతుల నవీన్‌కు జడ్పీ అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టేందుకు అధిస్థానం నిర్ణయించుకున్నట్టు భోగట్టా! ఈ వార్త అధికారికంగా వెలువడిన పక్షంలో పార్టీలో అసమ్మతికి ఆస్కారం ఉంటుందని, కాంగ్రెస్‌ మార్కు సంస్కృతి తెలుగుదేశంలోనూ మొదలైనట్టు స్పష్టమవుతోందని టీడీపీకి చెందిన నేతలు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show comments