ఐదారేళ్లలో విశ్వనగరం...సాధ్యమేనా?

'హైదరాబాద్‌ నరకకూపం' అంటూ గత ఐదారు రోజులుగా అన్ని టీవీ ఛానెళ్లు గంటలు గంటలు వర్ష బీభత్సాన్ని, వరదల ఉధృతిని అదే పనిగా ప్రసారం చేశాయి. అన్ని పత్రికలు పేజీలకు పేజీలు ఫోటోలతో నగరం దుస్థితిని కళ్లకు కట్టాయి. నగరం నరకాన్ని తలపించిన రోజుల్లో ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు మీడియా సమావేశం పెట్టి ఇదంతా లైట్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి అని తేల్చేశారు. రోజుల తరబడి ఉధృతంగా వాన కురిస్తే ఇబ్బందులు కలుగుతాయని, భరించక తప్పదని సర్దిచెప్పారు. హైదరాబాదును ఐదారేళ్లలో విశ్వనగరం చేసి పారేస్తామని, ఆ తరువాత ప్రజలు ఎలాంటి తిప్పలు లేకుండా సుఖశాంతులతో ఉంటారని ముక్తాయింపు పలికారు.

హైదరబాదు వరద పరిస్థితిపై మీడియా అతి ప్రచారం చేసిందని కూడా అభిప్రాయపడ్డారు. ఇలాంటి దుస్థితి వస్తుందని తనకు ముందే తెలుసునని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో తాను ఈ విషయం చెప్పానని అన్నారు. హైదరాబాదుకు పెద్దగా డ్యామేజీ జరగలేదని, నగరంలో తొమ్మిది వేల కిలోమీటర్ల మేరకు రోడ్లుంటే కేవలం పది శాతం మాత్రమే దెబ్బ తిన్నాయని, ఒక్క మరణం కూడా సంభవించలేదని చెప్పుకొచ్చారుఈ వానల కారణంగా జిల్లాల్లో మిషన్‌ కాకతీయ చెరువులు మంచి ఫలితాలు ఇస్తున్నాయని సంతోషపడ్డారు.

ఇంకో ఐదారేళ్ల వరకు వానలు ఇలాగే కురుస్తాయని, ఇదంతా మంచికేనని అన్నారు. హైదరాబాదుకు ఇలాంటి దుస్థితి రావడానికి కారణం ఎవరు? అని ప్రశ్నించి జవాబు కూడా ఆయనే చెప్పారు. జవాబు అందరికీ తెలిసిందే. రాష్ట్రాన్ని అరవై ఏళ్లపాటు పరిపాలించిన కాంగ్రెసు, టీడీపీ ప్రభుత్వాలు. నగరాన్ని ఎలా తీర్చి దిద్దబోతున్నారో, ఏవిధంగా బాగు చేయబోతున్నారో, అందుకు ఎంతెంత నిధులు కావాలో, అవి ఎలా సమకూరుస్తారో....ఇలా చాలా విషయాలు కేసీఆర్‌ వివరించారు. హైదరాబాదును విశ్వనగరమని ప్రచారం చేశారని, కాని అది నరకకూపమని మీడియా తన కథనాల్లో చెప్పడం కేసీఆర్‌కు కోపం తెప్పించింది. 

ఒక్క రాత్రిలో విశ్వనగరం కాదని, ఐదారేళ్లలో చేస్తామని కేసీఆర్‌ ప్రతిజ్ఞ చేస్తున్న తీరులో చెప్పారు. నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు కేంద్రం నుంచి 15-20 వేల కోట్ల అప్పు తీసుకొని జీహెచ్‌ఎంసీకి ఇస్తామన్నారు. 11 వేల కోట్ల ఖర్చుతో నాలాలు విస్తరిస్తామన్నారు. హైదరాబాద్‌ దుస్థితికి గత ప్రభుత్వాలే కారణమని కేసీఆర్‌ చెప్పడంలో కొంత నిజమున్నా పూర్తిగా వాస్తవం కాదు. గత రెండున్నరేళ్లలో కేసీఆర్‌ సర్కారుగాని, జీహెచ్‌ఎంసీగాని నగరాన్ని బాగు చేయడానికి ఏమీ చేయలేదనే విమర్శలున్నాయి. రోడ్ల బాగుకు పైసా ఖర్చు చేయలేదనే ఆరోపణలున్నాయి. ఇందులోనూ వాస్తవముంది. 

ఇక గత ప్రభుత్వాల్లో మంత్రి పదవుల్లోనూ, ఇతర కీలక స్థానాల్లోనూ ఉన్నదెవరు? ప్రస్తుతం కేసీఆర్‌ ప్రభుత్వంలో ఉన్నవారు అనేకమంది ఉన్నారు. హైదరాబాదు దుస్థితికి వారూ కారకులే కదా. ఇప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా గతంలో ఏ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ లేని నాయకులతో ఏర్పడలేదు. అప్పటి నాయకులే పార్టీ పేరు, రంగులు మార్చుకొని ఇప్పుడు అధికారంలో కొనసాగుతున్నారు. నగరంలోని నాలాల మీద 28 వేల అక్రమ కట్టడాలున్నాయని, వాటిల్లో కొన్ని ప్రభుత్వ నిర్మాణాలూ ఉన్నాయని కేసీఆర్‌ చెప్పారు. 

ఇప్పటి దుస్థితికి ఆ నిర్మాణాలు కారణమనడంలో సందేహం లేదు. నగరం మొత్తం మీద లక్షకు పైగా అక్రమ కట్టడాలున్నాయని ఓ ఆంగ్ల పత్రిక రాసింది. ఒక్క నాలాల మీది నిర్మాణాలే కాకుండా ప్రతి అక్రమ కట్టడాన్ని కూల్చాలి. ప్రభుత్వం ఆ పని చిత్తశుద్ధితో చేయగలదా? అధికారానికి వచ్చిన కొత్తల్లో అక్రమ కట్టడాల పేరుతో కొన్ని భవనాలను కూల్చి, కొన్నింటికి నోటీసులు ఇచ్చి హడావుడి చేశారు. ఆ తరువాత డబ్బు కట్టి క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇచ్చారు. కొంత డబ్బు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవడం కష్టమా? అక్రమ కట్టడమని తేలితే కూల్చాలిగాని క్రమబద్ధీకరణ చేయడమేంటి? మళ్లీ ఇప్పుడు అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటున్నారు. 

అక్రమ నిర్మాణం సమాచారం చెబితే పది వేల రూపాయల బహుమానం ఇస్తామని, చెప్పిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని కేసీఆర్‌ అన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చాలనే చిత్తశుద్ధి సర్కారుకు ఉంటే వాటిని కనుక్కోవడం కష్టమా? అక్రమ కట్టడాలను రక్షించుకోవడానికే కొందరు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదన్న కేసీఆర్‌ వీరి బిల్డింగులూ కూలుస్తారా? అధికారంలోకి రాగానే 'ఇది హైటెక్‌ సిటీ కాదు..లోటెక్‌ సిటీ' అని ముఖ్యమంత్రే అన్నారు. అప్పటినుంచే సిటీని బాగు చేసుంటే ఇప్పుడు ఈ దుస్థితి ఇంత తీవ్రంగా ఉండేది కాదు. తమది మాటల ప్రభుత్వం కాదని ఈరోజు కేసీఆర్‌ చెప్పారు. చూద్దాం...ఏం చేస్తారో...!

Show comments