క్రికెట్‌ పరువు బజార్న పడేసిన బీసీసీఐ

పేరు గొప్ప ఊరు దిబ్బ.. ఇదీ బీసీసీఐ తీరు. అంతర్గతంగా అన్నీ లోపాలే. పైకి మాత్రం మేడిపండు చందం. ఆ లోపాల్ని సరిదిద్దడానికి స్వయంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అసలు బండారం బయటపడింది. బీసీసీఐ దుస్థితి ఎంత దయనీయంగా వుందంటే, ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డ్‌కి క్షమాపణ చెప్పుకునేంతలా. 

మరీ, ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుకి సంబంధించిన ఖర్చులు భరించలేనంత దుస్థితికి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ దిగజారిపోయిందా.? ఈ మాట ఎవరన్నా వింటే నిజంగానే నవ్విపోతారు. నవ్విపోదురుగాక మనకేటి.? అన్న చందాన బీసీసీఐ వ్యవహరిస్తోంది. జస్టిస్‌ లోథా కమిటీ సిఫార్సుల్ని పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించడంతో, బీసీసీఐ వింత పోడకలు ప్రదర్శిస్తుండడం గమనార్హం. 

బీసీసీఐ చుట్టూ న్యాయస్థానం జోక్యం కారణంగా, క్రికెట్‌ బజార్న పడిందనే సంకేతాలు ఇచ్చేందుకోసం ఇదిగో, ఇలాంటి వేషాలేస్తున్నట్లు కన్పిస్తోంది. లేకపోతే, ప్రపంచంలోనే అతి సంపన్నమైన క్రికెట్‌ బోర్డ్‌గా పేరున్న బీసీసీఐ, ఇంగ్లాండ్‌ టూర్‌కి సంబంధించి ఖర్చులు భరించలేకపోవడమేంటట.? పైగా, లోథా కమిటీని 'ఖర్చులు భరించాల్సి వస్తుంది..' అని కోరితే, అది బీసీసీఐ - ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డ్‌ మధ్య జరిగిన ఒప్పందం.. అంటూ లోథా కమిటీ తెగేసి చెప్పడమేంటి, తత్ఫలితంగా బీసీసీఐ - ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డ్‌కి క్షమాపణ చెప్పడమేంటి.? ఇదంతా చూస్తోంటే, తెరవెనుక ఏదో 'మాయదారి నాటకం' జరుగుతున్నట్లే అన్పిస్తోంది కదా.! 

ఆర్థిక లావాదేవీలు జరపలేని స్థితిలో వున్నందున, ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డే తమ జట్టు ఖర్చుల్ని భరించాలని బీసీసీఐ తేల్చి చెప్పడంతో, ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డ్‌ అందుకు సానుకూలంగా స్పందించింది. దాంతో యదాతథంగా ఇంగ్లాండ్‌ టూర్‌ భారత్‌లో కొనసాగనుంది. కానీ, భారత పరువు క్రికెట్‌ సమాజంలో సర్వనాశనమైంది. చాలాకాలం నుండీ సుప్రీంకోర్టు, బీసీసీఐ తీరుని ప్రశ్నిస్తూ వస్తోంది. ఇప్పటిదాకా నాన్చి, కీలకమైన సమయంలో ఇలా క్రికెట్‌ని పణంగా పెట్టడం బీసీసీఐకి తగునా.?

Show comments