నంద్యాల టికెట్ శిల్పాదే..నట!

నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డికే దక్కుతుందని అంటున్నాడు తెలుగుదేశం ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి. ఈ మేరకు ఆయన తమ అనుచరులకు భరోసా ఇచ్చాడు. భూమా నాగిరెడ్డి మరణంతో జరుగనున్న ఎన్నికల్లో టీడీపీ టికెట్ విషయంలో ఇప్పటికే రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శిల్పా చక్రపాణి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.

నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ శిల్పా మోహన్ రెడ్డికి దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఈయన, ఈ విషయంలో భూమా ఫ్యామిలీ కూడా ఒప్పుకుంటుందని ఈయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని శిల్పా చక్రపాణి తన అనుచరులకు భరోసా ఇచ్చాడు.

మరి నంద్యాల ఉప ఎన్నికల్లో తమ కుటుంబంలోని ఎవరో ఒకరు పోటీలో ఉంటారని ఇప్పటికే భూమా అఖిలప్రియ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. శోభా నాగిరెడ్డి వర్ధంతి రోజును అందుకు సంబంధించిన ప్రకటన చేస్తామని ఆమె ప్రకటించేశారిప్పటికే. ఇలాంటి నేపథ్యంలో చక్రపాణి వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

నంద్యాల టికెట్ ను వదులుకోవడానికి అనుగుణంగా భూమా కుటుంబంతో చర్చలు జరుగుతున్నాయని ఈయన అంటున్నారు. మరి ఈ మాటలన్నీ కేవలం అనుచరులను కాసేపు సంతోష పెట్టడానికేనా? లేక నిజంగానే నంద్యాల పోరు  నుంచి భూమా ఫ్యామిలీని తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. 

Readmore!

తన సోదరుడికి టికెట్ దక్కకపోయినా ఫర్వాలేదనే దశలో ఉన్నాడీయన. మండలి చైర్మన్ పదవిని ఇస్తానని బాబు హామీ ఇచ్చేయడంతో ఇక సోదరుడికి టికెట్ దక్కితే ఎంత దక్కకపోతే ఎంత? అనుకుంటున్నాడీయన.

Show comments