ఫీలర్లు మీడియావి.. తిట్లు జగన్ కు

అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది చినబాబు లోకేష్ వ్యవహారం. తెలుగుదేశం జనాల శిక్షణా శిబిరానికి ఏ కారణం వల్లో చినబాబు హాజరు కాలేకపోయారు. సాధారణంగా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు అన్నీ లోకేష్ నే స్వయంగా నిర్వహిస్తుంటారు. ఆయన హాజరు కాకపోవడంతో రెండు రకాల వార్తలు పుట్టుకొచ్చాయి. 

లోకేష్ కు ఆరోగ్యం అంతగా బాగోలేదన్నది ఒకటి. ఇలాంటి వార్త కామన్. రెండో వార్త కాస్త స్పైసీ. మంత్రి పదవి ఇవ్వనందుకు తండ్రి చంద్రబాబుపై లోకేష్ అలిగారు అన్నది ఆ వార్త. కార్తకర్తలకు, జనానికి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని అనుకున్నారో, ఆరోగ్యం బాగైందో, ఏమయితేనేం శిక్షణ శిబిరాల సమావేశానికి లోకేష్ హాజరయ్యారు. అంతవరకు బాగానే వుంది. కానీ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ, జగన్ పై నిప్పులు చెరిగారు. 

ఎప్పటిలాగానే, తండ్రికి తల వంపులు తెచ్చే పనులు జగన్ మాదిరిగా తాను చేయనని తెగేసి చెప్పారు. తను అలిగినట్లు జగన్ నే తప్పుడు వార్తలు పుట్టించారనే రేంజ్ లో విమర్శలు చేసారు. వైఎస్ కు తలవంపులు తెచ్చాడా లేదా జగన్ అన్నది ఇంకా నిర్ణయం కాలేదు.ఇంకా ముందు చాలా వుంది అన్నది వాస్తవం. ఎందుకంటే వైఎస్ బతికి వున్నంతకాలం జగన్ కు సమస్యలు లేవు. తండ్రి పోయాక కూడా సిఎమ్ కావాలనుకున్నాడు కాబట్టి సమస్యలు వచ్చాయి. అది అందరికీ తెలుసు. 

అదృష్టం బాగుండి జనం ఆశీర్వదిస్తే సిఎమ్ అవుతాడు. అప్పుడు తండ్రి పేరు నిలబెట్టినట్లే అవుతుందిగా? ఉత్తరప్రదేశ్ లో నిన్న మొన్నటి వరకు అఖిలేష్ సూపర్ అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు ఏమయింది. అయిదేళ్లు తిరిగేసరికి తండ్రి ములాయమ్ నే కొడుకును విమర్శిస్తున్నాడు.  లోకేష్ విషయానికి వస్తే, ఇంకా తండ్రి చాటు బిడ్డే. రేపు ఎలా వుంటుందో? సిద్దాంతాల ప్రాతిపదికగా, అభివృధ్ధి ప్రాతిపదికగా విమర్శలు చేయడం మాని లోకేష్ ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం అంత సరికాదేమో?

Show comments