పవన్ 'కదిలించగా' రాలింది ఇదేనా..?!

ఎక్కడ నుంచినో సమాచారం వచ్చింది.. త్వరలోనే ప్యాకేజీ గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉందని, ఇంకేముంది.. రెండేళ్లుగా మూలనున్న ముసలమ్మలా కూర్చున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హఠాత్తుగా లేచొచ్చాడు. ప్రశ్నించడానికి రావేంటి? అని జనాలు ప్రశ్నించినప్పుడు రాని పవన్ కల్యాణ్ హాఠాత్తుగా తిరుపతిలో సభ పెట్టడం ఏమిటి చెప్మా? అంటే.. దీని వెనుక ఏదో గూడుపుఠానీ ఉందనే అభిప్రాయాలే వినిపించాయి.

ప్రత్యేకించి కొంతమంది మాట్లాడిన తీరు పవన్ విషయంలో అనుమానాలకు బలాన్ని ఇచ్చింది. రెండేళ్ల నుంచి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఎన్ని దీక్షలు చేసినా, ఆ విషయంలో ఎన్ని సదస్సులు నిర్వహించినా, ఎన్ని సార్లు రోడ్డుకు ఎక్కినా.. ఎన్ని సార్లు డిమాండ్ చేసినా  .. అ అంశంపై స్పందించని వాళ్లు ఒక మాట అన్నారు. “పవన్ సభతో కేంద్రంలో కదలిక వచ్చింది, పవన్ సభ తర్వాత ఈ అంశాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది… దీనిపై ప్రకటన చేయనుంది.  ఇప్పుడు కేంద్రం నుంచి ఏ ప్రకటన వచ్చినా దాని క్రెడిట్ కేంద్రానికే చెందుతుంది..’’ అంటూ కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కడం మొదలు పెట్టారు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు జాకీలేసే వాళ్లు ఈ మాటలు మాట్లాడుతుండటంతో ఈ గేమ్ పై స్పష్టత వచ్చింది. రెండేళ్ల నుంచి ఖాళీగా తన సినీ వ్యాపారాన్ని చేసుకున్నా ఫర్వాలేదు, కేంద్రం నుంచి ఏదో ప్రకటన వచ్చే టైమొచ్చింది  కాబట్టి.. పడుకున్న పవన్ కల్యాణ్ తో తిరుపతిలో మీటింగ్ పెట్టించారు, ఆ సభలో పవన్ రొటీన్ యాక్షన్ చేశాడు. ఇక కేంద్రం నుంచి ఏ ప్రకటన వచ్చినా.. అది పవన్ సభ వల్లనే సాధ్యం అయ్యిందని ముందే మొదలుపెట్టేశారు!

తొందర పడి ఓ కోయిలా ముందే కూసింది.. అన్నట్టుగా  కేంద్రం ముష్టివిదిల్చినా దాని క్రెడిట్ పవన్ కే దక్కాలి అని వీళ్లు తాపత్రయపడ్డారు!

మరి అతిగా ఆశపడే వాళ్లు ఆడళ్లైనా, మగాళ్లైనా సుఖపడినట్టు చరిత్రలో లేదు.. పవన్ ను అడ్డం పెట్టుకుని గేమ్స్ ఆడిన వాళ్లకు, పవన్ కల్యాణ్ కు అదే అనుభమే ఎదురైనట్టుంది! పవన్ సభ దగ్గర నుంచి మొదలైన హడావుడికి బుధవారం రాత్రితో కొంత బ్రేక్ వచ్చినట్టే.

పవన్ సభతో కేంద్రంలో కదలిక వచ్చిందన్నారు .. వచ్చిన ఆ కదలిక ఏమనగా.. ఏపీకి ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ గురించి ఆలోచిద్దాం! అనేది. మరి కేంద్రం ఏదో చేస్తుందని పవన్ ను సూపులోకి లాగితే.. ఢిల్లీలోగేమ్ కాస్తా బెడిసి కొట్టింది? మరి ఇప్పుడేమంటారో..పవన్ వల్లనే కేంద్రంలో ‘కదలిక’ అన్న వాళ్లు!

అలాగే ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏమంటాడో కూడా తెలియాల్సి ఉంది. తిరుపతిలో గట్టిగా మాట్లాడి కేంద్రాన్ని “కదిలించేసిన’’ జనసేన అధినేత, అంత “కదిలించినా’’ రాలిందేమీ లేకపోవడంతో కాకినాడ లో సభను జరిపేనా? తిరుపతిలో హెచ్చరించిన ఈయన కాకినాడలో ఏమంటాడు? ఆల్రెడీ పచ్చ వ్యూహంతో పప్పులో కాలేసిన పవన్ ఈ సారి కూడా హెచ్చరికలతోనే సరిపెడతాడా? అంతకు మించి తను కూడా ఇంకేం చేయలేను అని తేల్చేస్తాడా? 

ఈ రెండు గాక ప్రత్యేకహోదా పోరాటంలో భాగస్వామి అవుతాడా? లేక కాల్షీట్లు ఖాళీగా ఉన్నప్పుడు, సినిమా పని బోర్ కొట్టినప్పుడు.. చంద్రబాబు జాకీల వ్యూహానుసారం అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇలాంటి “రాజకీయ’మే చేస్తూ  పబ్బం గడుపుతాడా?

Show comments