బాబు, కేసీఆర్... తేడా చూశారా..!

16వ ఎదురుదెబ్బతో విలవిల లాడుతోంది కేసీఆర్ సర్కారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాల పట్ల న్యాయస్థానాలు ఆక్షేపణలు చెప్పడం ఇదేమీ కొత్త కాదు.. వరస ఎదురుదెబ్బలతో కేసీఆర్ సర్కారు ఇరకాటంలో పడుతూనే ఉంది. ఇది పదహారవ ఎదురుదెబ్బ. నిన్నలా మొన్న వీసీల నియామకంపై ఎవరో కోర్టుకు ఎక్కితే ఆ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నియామకాలను కోర్టు రద్దు చేసింది. హైకోర్టులో అలా ఎదురుదెబ్బ తగలడంతో తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఇంకా న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే భూ సేకరణ జీవో మీద కోర్టు అభ్యంతరం చెప్పింది.  సాగునీటి ప్రాజెక్టుల కోసమే అయినా.. పాత చట్టం ప్రకారం భూ సేకరణ జరగాలి తప్ప.. ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి భూ సేకరణ చేస్తామంటే కుదరదని హై కోర్టు స్పష్టం చేసింది.

అసలే  తెలంగాణలో వివిధ సాగునీటి ప్రాజెక్టులకు భూ సేకరణ అంశం.. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో హై కోర్టు తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి శరాఘాతమే అని చెప్పాలి. మరి ఈ పరిణామంతో ప్రతిపక్ష పార్టీలు పండగ చేసుకుంటున్నాయి! 

ఈ అంశాన్ని మరోరకంగా పరిశీలించి చూస్తే.. కేసీఆర్, చంద్రబాబుల మధ్య తేడా ఏమిటో అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. పాత భూ సేకరణ చట్టాన్ని కాదనుకుని కేసీఆర్ కొత్త జీవో తెచ్చి సాగునీటి ప్రాజెక్టులకు భూమిని సేకరించే ప్రయత్నంలో అభాసుపాలయ్యాడు. అయితే.. చంద్రబాబు మాత్రం పాత చట్టాన్ని తుంగలో తొక్కి వేల ఎకరాల భూమిని సేకరించాడు, సేకరిస్తూనే ఉన్నాడు, భవిష్యత్తులో కూడా సేకరించగలడు! భూ సేకరణ అంశం గురించి కేంద్రం చేసిన చట్టాన్ని కాదని, ప్రత్యేకంగా జీవో తెచ్చి.. రాజధానికి ల్యాండ్ పూలింగ్ చేశాడు ఏపీ ముఖ్యమంత్రి.

రాజధాని నిర్మాణం విషయంలో ఏర్పాటు చేసిన కేంద్ర కమిటీని సిఫార్సులను కాదని..ఈ విషయంలో ప్రతిపక్షాల, రైతుల నిరసనలను పట్టించుకోకుండా బాబు ఏకంగా వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారు. ఇదంతా పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం కాకుండా.. ప్రత్యేక జీవో ద్వారా బాబు చేసిన పని! ఇలాంటి పనే చేయబోయాడు తెలంగాణ ముఖ్యమంత్రి. బాబు తీసుకొచ్చిన జీవో మీద అనేక మంది కోర్టుకు వెళ్లారు.  అయితే వారెవరికీ ఊరట దక్కలేదు. ల్యాండ్ పూలింగ్ విజయవంతం అయినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ సాగునీటి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా పడ్డ పిటిషన్ మాత్రం ఈ ప్రభుత్వం పాశపతాస్త్రంగా మారింది.

యూపీఏ వాళ్లు తీసుకొచ్చిన భూ సేకరణ చట్టమే ఇప్పటి వరకూ అధికారికంగా అమల్లో ఉంది. దీనికి పలు సవరణలు తీసుకొచ్చిన మోడీ కూడా న్యాయస్థానల వద్ద నెగ్గలేకపోయాడు. దీంతో పాత చట్టమే మళ్లీ అమల్లోకి వచ్చింది. ఆ చట్టాన్ని పట్టించుకోకుండా.. తన ఇష్టం మేరకు జీవో తెచ్చి చంద్రబాబు వేల ఎకరాలు ఇష్టానికి సేకరించగలిగాడు.  కేసీఆర్ మాత్రం పరువు పోగొట్టుకున్నాడు. “న్యాయ’’స్థానాల వద్ద బాబుకు ఉన్న పట్టుకు, మిగిలిన వారికి ఉన్న ఉన్న తేడా! 

Show comments