దాసరి మరణం.. ఈ ప్రశ్నకు బదులేది.?

ఈ మధ్యకాలంలో ప్రముఖుల మరణాలు అనుమానాస్పదమవుతున్నాయి. అందునా, సినీ ప్రముఖుల మరణాల వెనుక అనుమానాస్పద కోణం ఖచ్చితంగా తొంగి చూస్తోంది. తాజాగా, దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంపై ఇప్పుడిప్పుడే అనుమానాలు మొలకెత్తుతున్నాయి. స్వయానా ఆయన పెద్ద కోడలు సుశీల, తన మామగారి మరణంపై అనుమానాలున్నాయంటూ మీడియా ముందుకు రావడం గమనార్హం. 

దాసరి నారాయణరావు ఇంట 'కుటుంబ తగాదాలు' ఎప్పటినుంచో వున్నాయి. కొన్ని వివాదాలు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కాయి కూడా. ప్రస్తుతం దాసరి పెద్ద కుమారుడి వైవాహిక జీవితానికి సంబంధించి 'విడాకుల వ్యవహారం' కోర్టు పరిధిలో వుంది. 'మాకు విడాకులు రాలేదుగానీ..' అంటూ మీడియా ముందు ఏకరువు పెట్టారు దాసరి పెద్ద కోడలు సుశీల. 

దాసరి పెద్ద కోడలు సుశీల ఆరోపణల సంగతి అటుంచితే, ఎప్పుడూ హుషారుగా వుండే దాసరికి, వున్నపళంగా అంత తీవ్రమైన అనారోగ్యం ఎందుకు సంభవించింది.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. అధిక బరువుతో బాధపడ్తున్న దాసరి, బరువు తగ్గించుకునేందుకు శస్త్ర చికిత్సను ఆశ్రయించారనీ, అది వికటించడంతో పరిస్థితి విషమించిందనే వాదనలున్నాయి.

ఈ కారణంగానే ఆయన అన్నవాహికకు స్టెంట్‌ వేయాల్సి వచ్చిందట. అన్నవాహికకు స్టెంట్‌ వేయడం అనేది జనవరి నెలలోనే జరిగింది. ఆ తర్వాత దాదాపు రెండు నెలలకుపైనే దాసరి, ఆసుపత్రిలో వుండిపోవాల్సి వచ్చింది. 

కాస్త కోలుకున్న దాసరి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినా, తిరిగి ఆ గాయం తీవ్రతరమయ్యిందట. సినీ పరిశ్రమలోనే కాదు, ఈ మధ్యకాలంలో అధికర బరువుకి సంబంధించిన సర్జరీలు వికటిస్తుండడం చూస్తూనే వున్నాం. ఏడు పదుల వయసులో దాసరికి, బరువు తగ్గించే శస్త్ర చికిత్స చేయడం నిజమేనా.? నిజమే అయితే, దాసరి తనంతట తానుగానే ఆ శస్త్ర చికిత్సకు 'సై' అనేసి వుండాలి. అంటే, తన ప్రాణమ్మీదకి తానే తెచ్చుకున్నారనుకోవాలి. 

ఇంతకీ, ఈ మొత్తం ఎపిసోడ్‌లో కుటుంబ సభ్యులు చాలా చాలా అరుదుగా కన్పించడం కొత్త అనుమానాలకు తెరలేపుతోంది. దాసరి అంత్య క్రియల్లో ఆయన చిన్న కుమారుడి కంటే దాసరికి సినీ పరిశ్రమలో అత్యంత ఆప్తులైనవారే ముందున్నారు. 

ఏదిఏమైనా, దాసరి లేని లోటు పూడ్చలేనిది. అదే సమయంలో, ఆయన మృతి పట్ల అనుమానాలు తెరపైకి రావడమే ఇబ్బందికరం. ఓ సారి అనుమానాలొచ్చాక, ఆ అనుమానాలకు నివృత్తి దొరికి తీరాల్సిందే.

Show comments