బాబు అండ్ కో.. అంచనాలు అడ్డం తిరుగుతున్నాయా!

ఇప్పటికే ట్రంప్ కు విలువలు శూన్యం.. అని బాబు తేల్చి చెప్పాడు. ట్రంప్ నాలుగైదు పెళ్లిళ్లు చేసుకున్నాడని.. అతడికి బొత్తిగా నైతిక విలువల్లేవని బాబు వ్యాఖ్యానించాడు. ట్రంప్ కే కాదు.. అసలు అమెరికన్లకే విలువల్లేవని బాబు తేల్చి చెప్పాడు! వాళ్లు కుటుంబాలు.. బంధాలు, బాంధవ్యాలను పట్టించుకోరని బాబు వివరించుకొచ్చాడు.

ఆ తర్వాత మళ్లీ ఒకసారేమో.. “నాకూ వెంకయ్యకు అవకాశం ఉంటే.. అమెరికాలో పుడతాం..’’ అని అన్నదీ ఆయనే! ఒకవైపు ఆ పాశ్చాత్యులకు విలువల్లేవు, నైతిక విలువల్లేవు, అక్కడ బంధాలు, బాంధవ్యాలకూ విలువలేదు.. అంటూ దుమ్మెత్తిపోసిన బాబే.. అవకాశం ఉంటే.. తనూ, వెంకయ్యలు అక్కడ పుడతామని సెలవిచ్చాడు.

మరి అమెరికాను ఒకవైపు తిడుతూనే.. అక్కడి మనుషుల మనస్తత్వాన్ని దూషిస్తూనే, మరోవైపు వరం ఉంటే అక్కడే పుడతామని అనడం బాబు కు మాత్రమే సాధ్యం అవుతోంది.

మరి ఈ సంగతిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీలో ఉన్న వ్యక్తి గురించి బాబు అనుచిత వ్యాఖ్యానాలే చేశాడు. ట్రంప్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడా.. ఐదు చేసుకున్నాడా అనేది బాబుకు సంబంధం లేని అంశం. అది కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీడియా ఎదురుగా బాబు ఇలాంటి పిచ్చాపాటి కబుర్లు చెప్పడం సబబు కాదు. నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం తప్పు అయితే.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తిని బాబు ఎలా తన సన్నిహితుడిగా చేసుకున్నాడు? అనేదీ ఒక ప్రశ్నే కదా!

మరి ఎలాగూ ట్రంప్ అమెరికా ఎన్నికల్లో గెలవడు.. అని బాబు అండ్ కో అనుకున్నట్టున్నారు. దీంతో ఆయనపై ఇష్టానుసారం మాట్లాడారు. అయిపోయింది.. బాబుకు హిల్లరీ నుంచి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం కూడా వచ్చింది అని అనుకూల మీడియాలో కథనాలు కూడా రాయించేసుకున్నారు. హిల్లరీ, బాబు సన్నిహితులు అని రాయించుకున్నారు. తొందరపడి ఈ కోయిలలూ అన్నీ ముందే కూసేశాయి.

అయితే అమెరికాలో మాత్రం పరిస్థితి అడ్డం తిరుగుతోంది. హిల్లరీ- ట్రంప్ ల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరింది. క్రమంగా పుంజుకుంటున్న ట్రంప్ విజయంతో సంచలనం సృష్టించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి అదే జరిగితే అప్పుడు బాబు ఏమంటారు?

ట్రంప్ విషయంలో అనుచిత వ్యాఖ్యానాలు చేసిన ఈయన.. రేపటి నుంచి ట్రంప్ తనకు సన్నిహితుడని ప్రచారం చేసుకుంటాడా? చినబాబు ట్రంప్ తో కరచాలనం చేసిన ఫొటోలను ప్రచారంలోకి తీసుకొస్తారా? భారత దేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో బాబులాగా అనుచితమైన మాటలు మాట్లాడలేదు. అది అమెరికా అంతర్గత వ్యవహారం. బాబు మాత్రం తనకు సంబంధం లేని పెత్తనాల గురించి మాట్లాడాడు.

అనుకూల మీడియా నేమో హిల్లరీ గెలిచిసిందన్నట్టుగా కథనాలు రాసి.. తన వంతు పాత్రను పోషిస్తోంది. అయినా వీళ్లు ఘటనాఘట సమర్థులు. హిల్లరీ గెలిచేలా ఉందనిపిస్తోందని ట్రంప్ ను తిట్టారు.. క్లింటన్లతో బాబుకు బంధాన్ని కలిపారు. రేపు ట్రంప్ గెలిస్తే.. తూఛ్, ట్రంప్ విజయం వెనుక బాబే ఉన్నాడని ప్రచారం చేసే రకాలు కదా ఇవి!

Show comments