వర్మ.. ఇక మారడంతే.!

'మనం భారతీయులం.. ప్రాచీన కాలంలోకి వెళ్ళిపోతున్నాం.. ఇది సిగ్గు పడాల్సిన విషయం..' అంటూ రామ్‌గోపాల్‌ వర్మ, 'పద్మావతి' సినిమాపై తాజాగా జరిగిన దాడి ఘటన నేపథ్యంలో సోషల్‌ మీడియాలో తనదైన స్టయిల్లో స్పందించాడు. ఏంటో, వర్మ మాటలు ఎవరికీ అర్థం కావు. భారతీయులంతా ప్రాచీన కాలంలోకి వెళ్ళిపోతే, రామ్‌గోపాల్‌ వర్మ లాంటోళ్ళు జనాన్ని ఎడ్యుకేట్ చేయడానికే పుట్టుకొస్తున్నారేమో.

'పద్మవతి' సినిమా విషయంలో ఓ వివాదం నడుస్తోంది. ఆషామాషీ వివాదం కాదది. పద్మావతి అనే పాత్రకి చారిత్రక నేపథ్యం వుంది. సినిమాలో ఆ పాత్రని అసభ్యకరంగా చూపిస్తున్నారన్నది 'రాజ్‌పుట్‌ కర్ని సేన' వాదన. అదంతా ఉత్తదేనని అంటున్నాడు దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ. అయితే, చిత్ర యూనిట్‌ నుంచి అందుతున్న లీకుల్ని బట్టి చాలా కాన్ఫిడెంట్‌గా, 'పద్మావతి' సినిమా తమ మనోభావాల్ని దెబ్బతీసేలా వుందని 'రాజ్‌ పుట్‌ కర్నిసేన' ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఆ కథపై పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వాల్సింది సంజయ్‌ లీలా భన్సాలీనే. 

అది సినిమాకి సంబంధించిన గొడవ. 'ఉడ్తా పంజాబ్‌' సినిమా విషయంలోనూ వివాదం చెలరేగింది. ఆ మాటకొస్తే, తెలుగునాట ఎన్నో సినిమాలు వివాదాస్పదమవుతున్నాయి. వర్మ సినిమాలెదుర్కొన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. ప్రజాస్వామ్యం అన్నాక ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. సినిమాలు తీసే హక్కు సినీ జనాలకు ఎలా వుంటుందో, ప్రశ్నించే హక్కు జనాలకి కూడా వుంటుంది కదా.! అందరూ మంచి సినిమాలు తీయరన్నట్టు, అందరూ సంయమనంతో వుండరన్న విషయాన్నీ వర్మ గుర్తుంచుకోవాలి. అలాగని, దాడుల్ని ఎవరూ సమర్థించకూడదు. ఖండించాల్సిందే. కానీ, వాటిని మొత్తం సమాజానికి ఆపాదించేయకూడదు.

ఇక్కడ వర్మ, అంత షేమ్‌ పుల్‌గా ఫీలయ్యే విషయమేముందో.. అందునా, భారతీయులంతా ప్రాచీన కాలంలోకి వెళ్ళిపోతున్నారని ఆయన భావించేయడమేంటో ఎవరికీ అర్థం కావట్లేదు. వర్మ ఎలాంటి సినిమాలు తీసినా, అవి ఎంచక్కా విడుదలవుతున్నాయి.. సన్నీలియోన్‌ని చూసి నేర్చుకోవాలని చెబుతున్న వర్మ, ప్రాచీన ఆలోచనల్లోంచి పాశ్చాత్య ఆలోచనల్లోకి భారతదేశం ఇంకెలా మారాలో 'శిక్షణా కేంద్రాలు' ఏర్పాటు చేస్తే మంచిదేమో.!

ఓ సినిమా.. ఓ వివాదం.. ఓ వర్గం ఆందోళన.. దీన్ని మొత్తం భారతీయ సమాజానికి ఆపాదించేయడమేంటో, అసలు విషయం, వాస్తవం.. వర్మకి అర్థమయ్యేదెలా.?

Show comments