పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చ పచ్చగా కనిపిస్తుందట. పచ్చ పచ్చగా అంటే అదేదో అందంగా అనుకునేరు.. ఆ రంగు తప్ప, ఇంకేమీ కన్పించదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అందరికీ ఒకటే రంగు కన్పిస్తోంది. అది ఏ రంగు.? అనడక్కండి. చంద్రబాబు ఏ రంగు చూడమంటే టీడీపీలో అంతా అదే రంగుని చూస్తారు మరి.
'కేంద్రం ఇచ్చింది తీస్కోవడమే.. ఏమీ అనడానికి వీల్లేదు.. ఏమీ చేయలేం..' అని చంద్రబాబు చేతులెత్తేశాక కూడా, ప్రత్యేక హోదా విషయంలో కాస్త బుకాయించేందుకు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నానా తంటాలూ పడ్తున్నారు. 'ప్రత్యేక హోదా ఇవ్వలేం.. దానికి సమానంగా నిధుల్ని ఇస్తాం..' అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోమారు స్పష్టం చేశాక, ఆయన ప్రకటనను చంద్రబాబు ఆహ్వానించాక ప్రత్యేక హోదా గురించి టీడీపీ నేతలు ఇంకా బుకాయిస్తే అందులో అర్థం ఏమన్నా వుందా.?
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అసెంబ్లీలో టీడీపీ, బీజేపీల్ని నిలదీసే ప్రయత్నం చేసింది. అయితే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైఎస్సార్సీపీ అడ్డు తగులుతోందంటూ షరామామూలుగానే బొండా ఉమతోపాటు మంత్రి ఎర్రన్నాయుడు అసెంబ్లీలో అత్యుత్సాహం చూపించారు. సభలో ప్రభుత్వం ఈ విషయమై ప్రకటన చేస్తుందనీ, ఈలోగా వైఎస్సార్సీపీ గందరగోళం సృష్టించడం తగదనీ శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు షరామామూలుగానే నీతులు చెప్పే ప్రయత్నం చేశారు.
అంటే, పచ్చ పచ్చగా కొత్త కట్టు కథ చెప్పేందుకు అధికార పార్టీ రంగం సిద్ధం చేసుకుందనే కదా అర్థం.! ఒక లక్షా యాభై వేల కోట్ల రూపాయల ప్యాకేజీ.. అంటూ పచ్చ మీడియాకి లీకులిచ్చిన చంద్రబాబే, ఆ ప్రచారాన్ని అర్థరాత్రి ఖండించేయడం గమనార్హం. 'ఆ తరహా ప్యాకేజీ ఇస్తామన్నారు.. నేనే వద్దన్నాను..' అంటే ఏవో కాకి లెక్కలు చెప్పారు చంద్రబాబు. ప్రభుత్వం అసెంబ్లీలో దీనికి మించి గొప్ప ప్రకటన చేయడానికి ఏమీ లేదు.
అసలు అరుణ్ జైట్లీ ప్రకటనలోనే కొత్తదనం లేనప్పుడు, అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేయడానికి ఏముంటుందట.? కేంద్రం వద్ద బీజేపీ దేబిరిస్తున్న తీరుని ప్రతిపక్షం వైఎస్సార్సీపీ విమర్శించకూడదట. విమర్శిస్తే, అభివృద్ధి నిరోధకులట. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, కేంద్రం దృష్టిలో బిచ్చగాళ్ళను చేసేసిన టీడీపీ ప్రభుత్వానికి ప్రతిపక్షాన్నో ఇంకొకర్నో విమర్శించే నైతిక హక్కు వుందా.?