బలమైన నేతను ఇస్తే ఏపీలో యూపీ గెలుపు...!

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకో అయోమయంగా ఉన్నారనిపిస్తోంది. మీడియాలో వస్తున్న సమాచారాన్నిబట్టి చూస్తుంటే భవిష్యత్తు రాజకీయాలపై వారిలో స్పష్టత లోపించిందనే అభిప్రాయం కలుగుతోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీతో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా? వద్దా? అనే విషయమై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. టీడీపీతో పొత్తు ఉండాలా? వద్దా? అని నిర్ణయించేది కేంద్ర నాయకత్వం అయినప్పటికీ ఈ అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలను బహిరంగంగానే చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీతో తెగదెంపులు చేసుకున్నారు కాబట్టి అక్కడి కమలం నాయకుల్లో ఈ తర్జనభర్జన లేదు. వచ్చే ఎన్నికల్లో  తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. అంత ధీమా ఏమిటో తెలియదు. సరే...తెలంగాణ బీజేపీ విషయం అలా పక్కనుంచితే ఆంధ్రా బీజేపీ నేతల్లో కొందరు టీడీపీతో కలిసి పోటీ చేయాల్సిందేనని, అంతకుమించి మార్గం లేదని చెబుతుండగా, దేశవ్యాప్తంగా బీజేపీ బలం పెరిగింది కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే ఆంధ్రాలోనూ అధికారంలోకి వస్తామని అంటున్నారు.

అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోకూడదని వారి అభిప్రాయం. రాష్ట్ర బీజేపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు చంద్రబాబుపై విమర్శలు చేశారు. అమరావతి నిర్మాణం పేరుతో హడావుడి చేస్తున్నారని, గతంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు ఇంత హడావుడి చేయలేదని అన్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి విడిపోయిన ఛత్తీస్‌గఢ్‌ రాజధాని నయా రాయ్‌పూర్‌ను ఆ రాష్ట్ర హౌసింగ్‌ బోర్డే నిర్మించిందని, చంద్రబాబు సింగపూర్‌, జపాన్‌, లండన్‌ అంటూ హడావుడి చేస్తున్నారని వీర్రాజు విమర్శించారు. ఈయనకు బీజేపీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరుంది. రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ రాష్ట్రంలో బీజేపీ బలంగా లేదని అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కొనసాగించడమే మంచిదన్నారు. ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పలువురు నాయకులున్నారు. కేబినెట్లోని ఇద్దరు కమలం మంత్రులు చంద్రబాబుకు అనుకూలంగా ఉంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను తనవిగా ప్రచారం చేసుకుంటున్నా వారు గమ్మునుంటున్నారని కొందరు విమర్శిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించడం, ఉత్తరాఖండ్‌ను గెలుచుకోవడం, గోవా, మణిపూర్‌లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఏపీ బీజేపీలో అధికారంపై ఆశలు చిగురింపచేస్తున్నాయి. టీడీపీతో పొత్తు వద్దని వాదిస్తున్న నాయకులు ఏపీలో బీజేపీకి బలమైన నాయకుండుంటే యూపీ తరహా గెలుపు సాధ్యమేనని కేంద్ర నాయకత్వానికి చెబుతున్నారు. తమకు బలమైన నాయకుడిని ప్రసాదించి పార్టీని బలోపేతం చేసే అవకాశం ఇవ్వాలంటున్నారు. బంగారు లక్ష్మణ్‌, వెంకయ్య నాయుడు, నిర్మల సీతారామన్‌, రామ్‌మాధవ్‌ మొదలైనవారు పార్టీ మంచి అవకాశాలు ఇచ్చిన కారణంగానే పెద్ద నాయకులుగా ఎదిగారని చెబుతున్నారు. అలాంటి నాయకుడు ఇప్పుడు రాష్ట్రానికి అవసరమంటున్నారు. 'బాహుబలి'వంటి నాయకుడిని ప్రసాదిస్తే ఏపీలో యూపీ గెలుపు సాధిస్తామని చెబుతున్నారు. ఉత్తర భారతంలో గెలిచినంతమాత్రాన అదే ఫలితం దక్షిణాదిలో పునరావృతమయ్యే అవకాశం లేదని కొందరు కాషాయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటివారు పొత్తుకు అనుకూలంగా ఉన్నవారన్నమాట. ఏపీ బీజేపీకి బలమైన నాయకుడు కావాలనుకునేవారు ప్రస్తుత అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనా వేస్తున్నారన్నమాట. ఆయన చంద్రబాబుకు అనుకూలుడని, డేరింగ్‌, డాషింగ్‌ కాదనే అభిప్రాయముంది. టీడీపీ కమలం పార్టీని 'మిత్రుడు'గా చూడటంలేదని, పదవుల పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు బీజేపీ మంత్రులున్నా పనులు చేయించుకోలేని పరిస్థితి ఉందని ఓ వర్గంవారు వాపోతున్నారు. రాష్ట్రంలో 74 కేంద్ర పథకాలు అమలు జరుగుతున్నా బీజేపీకి క్రెడిట్‌ రావడంలేదని, వాటిని తన పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు. టీడీపీతో పొత్తు లేకపోయినా గెలిగే అవకాశం ఉందంటున్నారు. నిజానికి ఏపీలో బీజేపీ బలమేమిటో ఆ నాయకులకే తెలియదు.

Readmore!

Show comments

Related Stories :