పవన్‌కన్నా బీజేపీకి 'నాలెడ్జ్‌' వుందా.?

ప్రత్యేక హోదాకీ, ప్రత్యేక ప్యాకేజీకి మధ్య తేడాలు తెలుసుకుని పవన్‌కళ్యాణ్‌ మాట్లాడాలని బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జ్‌ సిద్దార్ధ నాథ్‌ సింగ్‌ సెలవిచ్చారు. ఒకప్పుడు పవన్‌కళ్యాణ్‌, బీజేపీకి మిత్రుడే. కానీ, ఇప్పుడు కాదు. 'అసలు పవన్‌కళ్యాణ్‌ ఎన్డీయేలో వున్నారో లేదో ఆయనే నిర్ణయించుకోవాలి..' అని ఓ సందర్బంలో సిద్దార్ధ నాథ్‌ సింగ్‌ ఘాటైన వ్యాఖ్యలే చేశారు. బీజేపీని ప్రశ్నించనంతవరకు పవన్‌కళ్యాణ్‌ మేధావి, పవర్‌ఫుల్‌ లీడర్‌.. ఇంకా ఇంకాచాలానే ఆ పార్టీ నేతల దృష్టిలో. ఇప్పుడు సీన్‌ మారిపోయింది. రాజకీయాల్లో అంతే మరి.! 

రాజకీయాల పట్ల పవన్‌కళ్యాణ్‌కి సరైన అవగాహన లేని మాట వాస్తవం. పెద్ద పాత నోట్ల రద్దు సహా పలు అంశాలపై పవన్‌కళ్యాణ్‌కి వున్న అవగాహన అంతంతమాత్రం. పవన్‌కళ్యాణ్‌, సోషల్‌ మీడియాలో ఏవేవో కామెంట్లు చేస్తున్నారు.. అవన్నీ ఆయనే చేశారనీ, అవగాహనతోనే చేశారనీ అనుకోలేం. అంత సిల్లీగా వుంటున్నాయవి. ప్రత్యేక హోదా విషయంలో మాత్రం, పవన్‌ - బీజేపీని ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నించడానికి అవగాహన అయితే అవసరం లేదు. 

పవన్‌ని బీజేపీ ప్రశ్నిస్తోంది సరే, అసలంటూ బీజేపీకి ప్రత్యేక హోదాపై అవగాహన వుందా.? లేదా.? ఇదిప్పుడు బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. బీజేపీ మాటల్లోనే చెప్పాలంటే, ఏమాత్రం నాలెడ్జ్‌ లేకుండా 2014లో, యూపీఏ హయాంలో జరిగిన చివరి పార్లమెంటు సమావేశాల్లో, అందునా రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం వెంకయ్యనాయుడు నినదించారు.. అరుణ్‌ జైట్లీ వంత పాడారు. ప్రత్యేక హోదాపై అప్పట్లో బీజేపీ నేతలకు ఎంత నాలెడ్జ్‌ వుందో ఏమో.! 

చిత్రంగా బీజేపీ అధికారంలోకి వచ్చాకనే, ఇటు వెంకయ్యనాయుడుకీ అటు అరుణ్‌ జైట్లీకీ ప్రత్యేక హోదాపై 'నాలెడ్జ్‌' పెరిగింది. 2014 ఎన్నికల్లో ప్రత్యేక హోదా పేరుతో ప్రచారం చేసినప్పుడు దురదృష్టవశాత్తూ నరేంద్రమోడీకి ప్రత్యేక హోదాపై నాలెడ్జ్‌ లేదు. ప్రధానమంత్రి అయ్యాకనే ఆయనకీ నాలెడ్జ్‌ వచ్చింది. ఆ నాలెడ్జ్‌ ప్రకారం, ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్‌కి నష్టమట. అద్గదీ అసలు విషయం. 

ఇక, ప్రత్యేక ప్యాకేజీ అన్న మాట చెప్పడానికీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సుముఖత వ్యక్తం చేయడంలేదు. దానికి ప్రత్యేక సహాయం అనే వింత పేరు పెట్టారు. దానికి చట్టబద్ధత ఏది.? అంటే, నో ఆన్సర్‌. రైల్వే జోన్‌ ఏమయ్యింది.? అని ప్రశ్నిస్తే కేంద్రం 'కామప్‌' అంటోంది. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తేంటి.? అంటే, చంద్రబాబు చేతుల్లో పెట్టేయబడ్డ జాతీయ ప్రాజెక్టు అట. తలపండిన రాజకీయ మేధావులకీ దీనర్థమేంటో అర్థం కావడంలేదు. అర్థం చేసుకునే నాలెడ్జ్‌ బీజేపీకి మాత్రమే వుంది. 

పవన్‌కళ్యాణ్‌కి నాలెడ్జ్‌ వుందా.? లేదా.? అన్నది కాదిక్కడ ముఖ్యం. దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి ఏ విషయంలో ఎంత నాలెడ్జ్‌ వుందన్నది ముఖ్యం. పెద్ద పాత నోట్లతో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసేంత నాలెడ్జ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని వంచించేంత నాలెడ్జ్‌ బీజేపీకి మాత్రమే వుంది. ఎనీ డౌట్స్‌.?

Show comments