విజయేంద్రప్రసాద్.. టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్‌లోనూ తిరుగులేని రచయితగా పేరొందారు. ఈయన 'బాహుబలి' రచయిత. తనయుడు రాజమౌళి చిత్రాలకు అద్భుతమైన కథలు అందించడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకునే విజయేంద్ర ప్రసాద్, 'రాజన్న' సినిమాకి దర్శకత్వం వహించిన విషయం విదితమే. బాలీవుడ్‌లో 'భజరంగీ భాయిజాన్' కథ అందించిందీ ఈయనే.!
ఇక, 'బాహుబలి' సినిమా గురించి మాట్లాడుతూ, పవన్‌కళ్యాణ్ పేరుని ప్రస్తావించారు విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో. 'బాహుబలి ది కంక్లూజన్'లో ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటోన్న విషయం విదితమే. ఆ సీన్‌కి ప్రేరణ పవన్‌కళ్యాణ్ అని విజయేంద్రప్రసాద్ పేర్కొనడంతో, అంతా షాక్‌కి గురయ్యారు.
పవన్‌కళ్యాణ్ అభిమానులు 'పవనిజం' పేరుతో, పలు సినిమా ఫంక్షన్లలో అల్లరి చేయడం చూస్తూనే వున్నాం. ఆ అల్లరిని మెగా క్యాంప్ హీరోలే జీర్ణించుకోలేకపోతున్నారు. 'చెప్పను బ్రదర్' అంటూ అల్లు అర్జున్ విసుక్కోవడం, నాగబాబు అయితే అసహనం వ్యక్తం చేయడం, చిరంజీవి సైతం అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, అభిమానుల్ని ఏమీ అనలేక చరణ్ ఆందోళన చెందడం.. ఇవన్నీ చూస్తూనే వున్నాం. కానీ, అందులోంచి 'లెక్కలేనంత అభిమానాన్ని' గుర్తించారు విజయేంద్రప్రసాద్. ఆ 'లెక్కలేనంత అభిమానాన్ని' 'బాహుబలి ది కంక్లూజన్' సినిమాలోని ఇంటర్వెల్ సీన్‌కి వాడేశారట.
విజయేంద్రప్రసాద్ ఈ మాట చెప్పగానే, పవన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుందన్నది నిర్వివాదాంశం. పవన్‌కళ్యాణ్‌కి వీరాభిమాని, పైగా భక్తుడు కూడా అయిన హరీష్ శంకర్ అయితే, విజయేంద్రప్రసాద్ ఇంటర్వ్యూని ప్రస్తావిస్తూ, 'ఆ స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు..' అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు ట్విట్టర్‌లో. దాంతో, హరీష్ శంకర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. హరీష్ శంకర్, అల్లు అర్జున్‌తో 'డిజె - దువ్వాడ జగన్నాథం' సినిమా తెరకెక్కిస్తోన్న విషయం విదితమే. పవన్ విషయంలో బన్నీ అలా, హరీష్ ఇలా.. అదిరిందిలే.!