జగన్‌, చంద్రబాబు.. 'కాపీ మాస్టర్‌' ఎవరు.?

రాజకీయాల్లో 'కాపీ కొట్టడం' అన్నది చాలా చాలా సాధారణమైన విషయం. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రతో జనంలోకి వెళితే, చంద్రబాబు ఆ పాదయాత్రని కాపీ కొట్టేశారు. ఎప్పుడో స్వర్గీయ ఎన్టీఆర్‌ మద్య నిషేధం అంటే, దాన్ని ఆ తర్వాత చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకున్నాయి.. వినియోగించుకుంటూనే వున్నాయి. సంక్షేమ పథకాల విషయంలో సరికొత్త ఆలోచనలకన్నా, పాత ఆలోచనలకు మెరుగుపెట్టడమే ఎక్కువగా కన్పిస్తుంటుంది. 

ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమం ఏ రాజకీయ పార్టీ చేపట్టినా, అభినందించి తీరాల్సిందే. కానీ, అలా ఊరుకుంటే రాజకీయం మనుగడ ఎలా సాధిస్తుంది.? మద్య నిషేధానికి సంబంధించి వైఎస్‌ జగన్‌, ఇటీవల జరిగిన తమ పార్టీ ప్లీనరీలో చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బెల్టు షాపుల ఎత్తివేతపై ప్రకటన చేసేశారు. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. 'అది మా ఘనత' అని వైఎస్సార్సీపీ చెప్పుకుంటోంటే, అదేం కాదు.. మేం చెయ్యాలనుకుంటున్న విషయాన్నే, ముందుగా కాపీ కొట్టేసి ప్లీనరీలో జగన్‌ ప్రకటించేశారని టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది.

మంచి నిర్ణయం గనుక, ఇప్పటికిప్పుడు అభినందించి, ఆ నిర్ణయం అమలు సరిగ్గా లేకపోతే ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీదనే వుంటుంది. కానీ, అంత ఓపిక ప్రతిపక్షంలో కన్పించడంలేదు. నిజానికి, వైఎస్సార్సీపీ ప్లీనరీ దెబ్బకే చంద్రబాబు సర్కార్‌ మద్య నియంత్రణపై ముందడుగు వేసిందన్నది నిర్వివాదాంశం.

చంద్రబాబుని చూసి జగన్‌ పాదయాత్ర చేస్తున్నారన్నది టీడీపీ ఆరోపణ. అయితే గతంలో వైఎస్సార్‌ చేసిన పాదయాత్రనే చంద్రబాబు కాపీ కొట్టారని వైఎస్సార్సీపీ అంటోంది. అది నిజమే కదా.! 2019 ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ బాగా పెరిగిపోయింది. ఒక పార్టీకి చెందిన ఆలోచనల్ని ఇంకో పార్టీ కాపీ కొట్టేయడం, ప్రజలకు చేరువయ్యేందుకోసం సరికొత్త వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటుండడం.. ఇవన్నీ షురూ అయ్యాయనుకోవచ్చు. Readmore!

ఈ క్రమంలోనే 'కాపీ' అన్న మాట తెరపైకొస్తోంది. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ప్రపంచానికి హైటెక్‌ పాఠాలు నేర్పానని చెప్పుకునే చంద్రబాబే పెద్ద 'కాపీ' మాస్టర్‌. కాపీ కొట్టడం తప్పు కాదు, కాపీ కొట్టి బుకాయించడమే హాస్యాస్పదం.

Show comments