ఓ యువతి, అర్థరాత్రి తన స్నేహితుడితో కలిసి బస్సులో ప్రయాణం చేయడమే మన భారతదేశంలో నేరంగా మారిపోయింది. అదీ దేశ రాజధానిలో. అర్థరాత్రి ఓ మహిళ ఒంటరిగా, ధైర్యంగా తిరగగలిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్ముడు చెప్పిన మాటలు, రాజకీయ నాయకుల నోట విన్పిస్తుంటాయిగానీ, దేశంలోని మహిళలకు మాత్రం మహాత్ముడు కలలుగన్న స్వాతంత్య్రం అయితే రాలేదని 'నిర్భయ' ఘటన నిరూపించింది.
ఆనాటి ఆ ఘటన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ఆరుగురు నరరూప రాక్షసులు ఓ యువతిని పొట్టనపెట్టుకున్నారు. తమ కామ వాంఛ తీర్చుకుని సరిపెట్టుకోలేదు, అత్యంత కిరాతకంగా, రాక్షసంగా, మాటలకందనంత కర్కశంగా ప్రవర్తించారు. కొసప్రాణంతో వున్న ఆమెను బస్సులోంచి విసిరేశారు. వైద్య చికిత్స పొందుతూ నిర్భయ తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నరరూప రాక్షసులు పట్టుబడ్డారు. అందులో ఒకడ్ని 'బాల నేరస్తుడిగా' పరిగణించి, అందుబాటులో వున్న చట్టాలమేరకు జైలు శిక్షతో సరిపెట్టి, ఆ తర్వాత విడిచిపెట్టిన విషయం విదితమే. మరొకడు, జైల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన నలుగురికీ ఉరిశిక్షను ఖరారు చేసింది తాజాగా సర్వోన్నత న్యాయస్థానం.
గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉరి శిక్ష తీర్పుని సుప్రీంలో నిందితులు సవాల్ చేయగా, ఇక్కడా వారికి చుక్కెదురయ్యింది. 'మాటల కందని రాక్షసత్వమది. ఇలాంటి నేరాలకి మరణ శిక్ష తప్ప మరో మార్గం లేదు..' అని ముగ్గురు సభ్యుల బెంచ్ ముక్తకంఠంతో తీర్పునిచ్చింది. అయినా, ఇంకోసారి నిందితులకు న్యాయస్థానంలో అపీల్ చేసుకునే ఛాన్స్ వుండడం గమనార్హం. అంటే, ఇంకొన్నాళ్ళు ఈ నరరూప రాక్షసులు భూమ్మీద, ప్రాణవాయువు పీల్చుకుంటారన్నమాట.
కాగా, మహిళా సంఘాలు 'ఇప్పటికే శిక్ష అమలు ఆలస్యమయ్యింది.. వీలైనంత త్వరగా, అదీ బహిరంగంగా ఉరిశిక్ష పడాలి..' అంటూ డిమాండ్ చేస్తున్నాయి. బాధిత కుటుంబం, 'మా బిడ్డకు న్యాయం జరిగిందని భావిస్తున్నాం.. దోషులకు శిక్ష ఎంత తొందరగా పడితే అంత మంచిది..' అని అభిప్రాయపడింది.