అమ్మో ఏపీభ‌వ‌న్‌

తెలుగువారు ఎక్కడున్నా త‌న్నులాట మాత్రం చాలా కామ‌న్‌గా మారిపోయింది. రాష్ట్ర విభ‌జ‌న‌ త‌ర‌వాత కూడా ఇక్కడ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విష‌యాల్లో నిత్యం క‌ల‌హించుకుంటుంటే తామేమీ త‌క్కువ తిన్నామా అంటూ ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో ఇరు రాష్ట్ర ఉద్యోగులు మ‌రోసారి బాహాబాహీకి దిగారు. వివాదాల‌కు పుట్టినిల్లు అయిన ఏపీభ‌వ‌న్‌లో ఇలాంటి కొట్లాట‌లు కొత్తేమీ కాదు. అస‌లు వాస్తవానికి ఏపీ భ‌వ‌న్‌లో జ‌రిగే ప‌రిణామాలే చాలా విచిత్రంగా ఉంటాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల‌కు ఏపీ భ‌వ‌న్‌లో ఏమి జ‌రుగుతుంద‌నే దానిపై  అవ‌గాహ‌న, అక్కడి అధికారుల‌పై ప‌ట్టు ఏమాత్రం లేదు. ద‌శాబ్ధాలుగా అక్కడే పాతుకుపోయిన కొంద‌రు అధికారులు, ఉద్యోగులు కుమ్మక్కై ఏపీ భ‌వ‌న్‌ను సామంత రాజ్యంగా ఏలుతున్నారు. 

కులాలు, మ‌తాలు, ప్రాంతాల వారీగా వారీగా ఏనాడో విడిపోయిన ఏపీ భ‌వ‌న్ ఉద్యోగులు నిరంత‌రం అధిప‌త్య ధోర‌ణితో రగిలిపోతూ ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్రయ‌త్నిస్తుంటారు. అస‌లు విధుల‌కే హాజ‌రుకాకుండా జీతాలు ఖాతాలో వేసుకుంటున్న ఉద్యోగులు అనేక‌మంది. వీరిని అడిగేవారు ఉండ‌రు. గ‌తంలో ఏపీ భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో కూడా ఉద్రిక్తత నెల‌కొంది. విగ్రహ ఏర్పాటును ఒక వ‌ర్గం వ్యతిరేకించినా మ‌రో వ‌ర్గంలో ప‌ట్టప‌బ‌ట్టి మ‌రీ పంతం నెగ్గించుకుంది. ఏపీ భ‌వ‌న్ ప‌ర్య‌వక్షించే రెసిడెంట్ క‌మిష‌న‌ర్లు సైతం ఏదో మూణ్ణాళ్లు ఉండిపోదాం ఈ రొచ్చు మ‌న‌కెందుకు అనుకున్న వాళ్లే త‌ప్ప  దాన్ని ప్రక్షాళ‌న చేసే ప‌నికి పూనుకోలేదు. 

ఇక ఏపీ భ‌వ‌న్ అతిథి భ‌వ‌నాల్లో జ‌రిగే అవ‌క‌త‌వ‌క‌లు అంత తేలిగ్గా అర్థం కావు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ‌చ్చే ప్రతినిధులు, ప్రభుత్వ నేత‌లు, ఉన్నతాధికారుల కోసం ఉద్ధేశించినా ఈ గెస్ట్‌హౌస్‌ల‌లో ఎవ‌రెవ‌రు వ‌స్తుంటారో, ఎందుకొస్తుంటారో ఒక ప‌ట్టాన అర్థంకాదు. ప్రభుత్వ రాయితీల‌తో అతి త‌క్కువ ధ‌ర‌కే గ‌దులు ల‌భించే గోదావ‌రి, స్వర్ణముఖి స‌ముదాయాల‌లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు మాఫియాగా మారిపోయార‌ని ఏపీ భ‌వ‌న్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. కొన్ని సార్లు ఎమ్మెల్యేలు సైతం రూముల కోసం ఏపీ భ‌వ‌న్ ఉద్యోగుల ద‌గ్గర దేబిరించాల్సిన ప‌రిస్థితి.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర‌వాత ఏపీ భ‌వ‌న్ ఉద్యోగుల మ‌ధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయ‌న‌డానికి  చాంబ‌ర్‌ల కేటాయింపు విష‌య‌మై ఇరు రాష్ట్ర ఉద్యోగులు ప‌ర‌స్పరం క‌ల‌బ‌డుకోవ‌డం తాజా ఉదాహ‌ర‌ణ‌. ఏపీ భ‌వ‌న్ ప్రయోజ‌నాలు మ‌రిగిన అనేక మంది ద‌శాబ్ధాలుగా అక్కడే పాతుకుపోయారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి బ‌దిలీ చేస్తామంటే వెళ్లే నాధుడే లేడు..అఫ్‌కోర్స్ అక్కడి ఉద్యోగులు అంత తేలిగ్గా ఎవ‌రినీ రానీయ‌రు..ఒక‌వేళ వ‌చ్చినా వారు ఏదో వ‌ర్గంలో చేరిపోవాల్సిందే త‌ప్పదు. ఈ తీరు తెలిసే రాష్ట్ర నాయ‌కులెవ‌రూ ఢిల్లీ వెళ్లినా ఏపీ భ‌వ‌న్ దిగేందుకు వెనుక‌డుగు వేస్తుంటారు. తాజా ప‌రిస్థితుల‌లో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఏపీ భ‌వ‌న్‌ను ఒక‌దారికి తెచ్చే బాధ్యతల‌ను తీసుకోవాల‌ని కొంద‌రిని కోర‌గా  అమ్మో ఏపీభ‌వ‌న్ సంగ‌తి మాకొద్దు బాబోయ్ అంటూ వారంతా త‌ప్పించుకుంటున్నారట‌.

Show comments