గిల్లుతాం.. జోలపాడతాం.. దటీజ్‌ కేసీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకన్నా, ఆ మాటకొస్తే పార్లమెంటు సమావేశాలకన్నా భిన్నంగా, ఆసక్తికరంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నది నిర్వివాదాంశం. వాకౌట్లు, నిరసనలు చట్ట సభల్లో మామూలే. అయినప్పటికీ, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాంటే, ఆ క్రెడిట్‌ పూర్తిగా తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి, అందునా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కీ ఇచ్చి తీరాల్సిందే. 

అధికార పక్షంపై విపక్షాల విమర్శలు, విపక్షాలపై అధికార పక్షం ఎదురుదాడి.. ఇవన్నీ చట్ట సభల్లో సర్వసాధారణంగా జరిగేవే. అయినాసరే, సభ నిర్వహణలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చూపుతున్న చొరవ నూటికి నూరుపాళ్ళూ అభినందనీయం. ఎందుకంటే, అక్కడ పార్లమెంటులో కాస్సేపు కూడా సమావేశాలు జరుగుతున్న దాఖలాల్లేవు మరి.! 

2013 భూ సేకరణ చట్ట సవరణకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో పెద్ద రచ్చే జరిగింది. తమకు సభలో మాట్లాడే అవకాశమివ్వలేదంటూ కాంగ్రెస్‌, టీడీపీ ఈ రోజు సభకు డుమ్మా కొట్టేశాయి. దాంతో, అసెంబ్లీ వెలవెలబోయింది. విషయం అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, విపక్షాలు సభలోకి వచ్చి చర్చించాలంటూ విజ్ఞప్తి చేయడం గమనార్హం. అదే సమయంలో, విపక్షాలపై అధికార పక్షం విమర్శలు షరామామూలేననుకోండి.. అది వేరేవ విషయం. 

గిల్లడంలోనూ, తిరిగి జోలపాడటంలోనూ కేసీఆర్‌ 'చాణక్యం' అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. చట్ట సభల్లో వాడి వేడి చర్చ జరగాలి.. అదే సమయంలో సభ కూడా హుందాగా జరిగి తీరాల్సిందే. ఈ విషయంలో తెలంగాణలోని అధికార పార్టీని అభినందించకుండా వుంలేం. అఫ్‌కోర్స్‌.. పార్టీ ఫిరాయింపులతో విపక్షాలకు వాత పెట్టి, వెన్నపూస్తే.. దానికి విపక్షాలు ఎలా సహకరిస్తాయ్‌.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.!

Show comments