అమీతుమీ కి అనుకోని తలనొప్పి

అవసరాల శ్రీనివాస్ చేసిన బాబు బాగా బిజీ సినిమా గురించి ఇఫ్పుడు బెంగ పెట్టుకుంటున్నది ఆ సినిమా నిర్మాతలు, దర్శకుడు కాదట. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ లతో మాంచి క్లాస్ కామెడీ తీస్తున్న అమీతుమీ యూనిట్ ఇప్పుడు తమ సినిమా ఓపెనింగ్స్ మీద ఈ సినిమా ఎఫెక్ట్ పడుతుందని కిందా మీదా అవుతోందట. పైకి ఏమీ అనకపోయినా, తమ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా విడుదల కావడం, కచ్చితంగా తమ సినిమా ఓపెనింగ్స్ ను కాస్త దెబ్బ తీస్తాయని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

అవసరాల అంటే ఇప్పటి దాకా క్లాస్ ఇమేజ్ వుంది. ఇప్పడు ఈ సినిమా చేయడంతో ఆ ఇమేజ్ కు కాస్త గండి పడింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎలాగూ బాబు బాగా బిజీకి దూరంగానే వుంటారు. అమీ తుమీకి క్లాస్ సినిమాలు అందించే ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరక్టర్ అని తెలిసినా, ఫస్ట్ డే టాక్ తెలిసే వరకు జనం కాస్త సినిమాకు దూరంగా వుంటారనే అభిప్రాయాలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఈ సమస్యను అధిగమించాలి అంటే, అమీతుమీ నిర్మాతలు  ట్రయిలర్, ప్రోమోలు ఫుల్ గా ప్రచారం సాగిస్తే తప్ప, అవసరాల తెచ్చుకున్న బాబు మార్కు అంత సులువుగా చెరిగిపోదు.

Show comments