టీడీపీని ఇబ్బంది పెట్టేవేవీ.. పార్లమెంటులో వద్దు!

హై కోర్టు విభజన అంశమా.. ఇప్పుడు దానికి తొందర ఏముంది?

ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయాలా.. ఎందుకు, అందులో సీరియస్ నెస్ లేదు కదా!

ప్రత్యేక హోదాపై ప్రైవేట్ బిల్లు.. కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదు, అలాంటి వాళ్లు బిల్లు ఎలా పెడతారు?

ఇదీ తెలుగుదేశం ప్రతినిధులు మాట్లాడుతున్న తీరు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు ఈ అంశాల గురించి లోక్ సభ, రాజ్యసభల్లో ప్రస్తావిస్తామని ప్రకటించేసరికి తెలుగుదేశం వాళ్లు రన్నింగ్ కామెంట్రీ మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పై అంశాల గురించి స్పందించాయి.

హైకోర్టు విభజన చేపట్టాలని.. ఏపీ దగ్గర కొత్త బిల్డింగ్ కట్టుకోవడానికి డబ్బులేకపోతే  హైదరాబాద్ లోనే పెద్ద భవంతి కేటాయిస్తామని, వాళ్ల వ్యవహారాలను అక్కడకు వెళ్లి తేల్చుకోవాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. అయితే హై కోర్టు విభజన బాబుకు సుతారమూ ఇష్టం లేదన్నది బహిరంగ రహస్యం. 

అరకొర ఏర్పాట్లతో సెక్రటేరియట్ ను ఒక లెక్కతో తరలించేసిన బాబు, మరో లెక్కతో హై కోర్టు విభజన పై తొందరలేదని అంటున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి బీజేపీ కూడా పరోక్షంగా సహకరిస్తూనే ఉంది. అయితే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం హై కోర్టు విభజన జరగాలంటారు!

ఇక ఫిరాయింపుల నిరోధక చట్టం సంగతి సరేసరి! తెలంగాణలో సొంత పార్టీ ని చీల్చుకుని అనేక మంది వెళ్లిపోయినా తెలుగుదేశం ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హతను కోల్పోయింది. ఏపీలో ఆ పార్టీ  అధినేత తీరుతో.. ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేయాలన్న డిమాండ్ వింటేనే టీడీపీ వణికిపోతోంది! ఏపీలో ఎక్కడ ఎన్నికలొస్తాయో అని భయమేమో!

ఇక లోక్ సభలోనేమో ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు నోటీసు ఇచ్చిన టీడీపీ ఇదే అంశంపై బిల్లు అంటే మాత్రం ఆ విషయంలో చొరవ చూపదు.  ఎలాగూ రాజ్యసభలో మోడీ ప్రభుత్వానికి అంతంతమాత్రం బలం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెట్టే ప్రైవేట్ బిల్లుకు మద్దతు కూడా గట్టడానికి ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో దీనికి తెలుగుదేశం కూడా సహకరిస్తే.. ఈ ప్రైవేట్ బిల్లుకు మద్దతు పలికితే.. ఈ బిల్లు గనుక రాజ్యసభలో గట్టెక్కితే.. ప్రత్యేకహోదా అంశంపై బీజేపీ ఇరకాటంలో పడుతుంది. అయితే ఈ విషయంలో తెలుగుదేశం సహకరించే అవకాశం కనపడటం లేదు. ఏదో ఈ సమావేశాల్లో పబ్బం గడపడానికి అన్నట్టుగా దీనిపై చర్చకు నోటీసిచ్చింది టీడీపీ. ఆ నోటీసును స్పీకర్ తిరస్కరింవచ్చు, ఏ సమాధానమూ చెప్పకుండా చర్చను చేపట్టకా పోవచ్చు! బహుశా.. టీడీపీ కి కావాల్సింది కూడా అదే కాబోలు!

Show comments