జగన్‌ దెబ్బకి పిల్లిమొగ్గలేస్తున్న చంద్రబాబు

వైఎస్‌ జగన్‌ ప్రకటించిన 'నవరత్నాలు' తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని చాలా గట్టిగానే తాకినట్టున్నాయి. 'పట్టించుకోవాల్సిన అవసరం లేదు..' అంటూనే, 'ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ..' అనే పాత మాటని సరికొత్తగా తెరపైకి తెచ్చారు చంద్రబాబు. సెప్టెంబర్‌ 17వ తేదీని ముహూర్తంగా ఫిక్స్‌ చేసేశారు. అంటే అటూ ఇటూగా జగన్‌ పాదయాత్రకి 40 రోజుల ముందు టీడీపీ 'షో' షురూ అవుతుందన్నమాట ఆంధ్రప్రదేశ్‌లో. 

అక్టోబర్‌ 27 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అంతటా పాదయాత్ర చేస్తాననీ, 180 రోజులు, 3 వేల కిలోమీటర్లకు పైగా తన పాదయాత్ర సాగుతుందని, అన్ని జిల్లాలు, నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేసి, ప్రజల్ని కలుస్తానని ప్లీనరీ వేదికగా వైఎస్‌ జగన్‌ ప్రకటించి, నాలుగైదు రోజులు గడవకముందే, చంద్రబాబు కంగారుపడ్డారు.. టీడీపీని జనంలోకి తీసుకెళ్ళేందుకు ప్రణాళిక రచించేశారు. 

'ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ' అన్నది కొత్త నినాదమేమీ కాదు. గతంలో చేసిందే.. అట్టర్‌ ఫ్లాప్‌ అయి కూర్చుందది. పైగా, పార్టీ నేతలే దానికి మొహం చాటేశారాయె. ఈ విషయం చంద్రబాబుకీ తెలుసు. అందుకేనేమో, ఒకింత గట్టిగా చెప్పారు.. సీరియస్‌గా తీసుకోకపోతే, సీన్‌ సితారైపోతుందని హెచ్చరించేశారు కూడా. 

అంతేనా, కథ చాలానే వుంది.. చంద్రబాబు కూడా అతి త్వరలో జిల్లాల పర్యటనలు చేస్తారట. అయితే, దానికింకా ముహూర్తం ఖరారు కాలేదు. జిల్లాల పర్యటనలంటే ఆషామాషీగా కాదు, జిల్లాల పర్యటన పేరుతో మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ కలియతిరిగేయాలన్నది చంద్రబాబు ఆలోచన అట. ఇకనేం, చంద్రబాబు తలచుకుంటే నిధులకు కొరతా.? అధికారిక కార్యక్రమాల పేరుతో ప్రత్యేక హెలికాప్టర్లలోనో, ఇంకో రకంగానూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ని చుట్టేస్తారన్నమాట. 

ఇంకా నయ్యం.. జగన్‌ తరహాలో చంద్రబాబు కూడా పాదయాత్ర చేసేస్తానన్లేదు.! ఏమో, ఆ ముచ్చటా ఇంకోసారి చంద్రబాబు తీర్చేసుకుంటారేమో.! 2014 ఎన్నికలకు ముందు ఇలాగే కదా, పాదయాత్ర చేసేశారు చంద్రబాబు. తాను వెళ్ళలేని పరిస్థితుల్లో నారా లోకేష్‌ని అయినా చంద్రబాబు పాదయాత్రకు పంపించే ఛాన్స్‌ లేకపోలేదు. ప్చ్‌, చంద్రబాబు అత్యుత్సాహం, పాపం నారా లోకేష్‌కి తిప్పలు తెచ్చిపెట్టేలా వుందండోయ్‌.!

Show comments