బికినీ బ్యూటీ 'మూస' కహానీ

హాలీవుడ్‌కి వెళ్ళాక ఇండియన్‌ సినిమాల్లో 'మూస' ధోరణలు గుర్తుకొస్తున్నాయి బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రాకి. 'ఇప్పుడిప్పుడే ఇండియన్‌ సినిమా మూస ధోరణులకు భిన్నంగా పయనిస్తోంది.. హాలీవుడ్‌తో పోటీ పడ్తోంది.. ఇంకా ఆ మూస ధోరణుల్లోనే సినిమాలు తీస్తూ పోతే కష్టం..' అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చింది ప్రియాంకా చోప్రా. 

కమర్షియల్‌ సక్సెస్‌ కోసం మూస ఫార్ములాని ఫాలో అవడం అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్నదేమీ కాదు. ఆ మాటకొస్తే, ప్రియాంకా చోప్రా అయినా, ఇంకెవరైనా పాపులారిటీ సంపాదించుకునేది ఆ 'మూస' కమర్షియల్‌ సినిమాలతోనే. అలా సక్సెస్‌ అయ్యాకే, 'కొత్తదనం' అంటూ కొత్త కొత్త దారుల్ని వెతుక్కోవడనికి వీలవుతుంది. ఈ మాట ఎవరో చెప్పింది అయితే వింతేముంది.! గతంలో ప్రియాంకా చోప్రా నోట వచ్చిన మాటలే ఇవి. 

రేంజ్‌ మారింది.. మాటలూ మారాయి. అదే తేడా. ఇక, హాలీవుడ్‌ మూవీ 'బేవాచ్‌'కి రేటింగ్స్‌ అంత గొప్పగా రాకపోవడంపైనా, తన మీద వస్తున్న విమర్శలపైనా పెదవి విప్పిన ప్రియాంకా చోప్రా, హాలీవుడ్‌లో తన ప్రయాణం అద్భుతంగా వుందనీ, విమర్శల్ని పట్టించుకోననీ చెప్పుకొచ్చింది. బికినీలో బీచ్‌లలో తిరగడమంటే సిగ్గంటూనే, సినిమా కోసం అవన్నీ తప్పలేదని అంటోంది. 

మొత్తమ్మీద, ప్రియాంకా చోప్రా - హాలీవుడ్‌కి వెళ్ళాక చాలా మారింది.. మళ్ళీ బాలీవుడ్‌లో మునుపటి వేగంతో సినిమాలు చేస్తుందా.? 'చెయ్యనని మాత్రం చెప్పను.. అయితే కొత్త ప్లాట్‌ఫామ్‌ దొరికింది గనుక, హాలీవుడ్‌కి కొంత, బాలీవుడ్‌కి కొంత సమయం కేటాయిస్తాను..' అని సెలవిచ్చింది ప్రియాంకా చోప్రా.

Show comments