యోగీ ఆదిత్యనాథ్‌కు రాజకీయాలపై విరక్తి పుట్టిందా!

అప్పుడే రాజకీయాలపై ఒకింత విరక్తితో మాట్లాడుతున్నారు యోగీ ఆదిత్యనాథ్. తను ఇట్టే ఎక్కువ కాలం పాలిటిక్స్ లో ఉండను.. అని ఆయన తేల్చి చెప్పేశాడు. కొంత కాలం తర్వాత గోరఖ్‌పూర్ మఠానికి వెళ్లిపోతానని యోగి ఒకింత సెన్షేషనల్ కామెంటే చేశాడు. భారతీయ జనతా పార్టీ అభిమానులేమో యోగిని తమ భవిష్యత్ ఆశాకిరణంగా చెబుతుంటే.. యోగి మాత్రం అబ్బే... మఠానికి వెళ్లిపోవడమే తరువాయి అంటున్నారు.

ఇటీవల యూపీ బీజేపీ కార్యకర్తలు యోగిని భవిష్యత్ ప్రధాని అంటూ వస్తున్నారు. మరి అవతల మోడీ నాలుగైదు టర్ముల పాటు దేశాన్ని ఏలతాడు అని వెంకయ్యనాయుడులాంటి వాళ్లు చెబుతుంటే.. ఇంతలోనే యోగి ఊసుతో ఆసక్తిని రేకెత్తించారు కమలం పార్టీ కార్యకర్తలు. అయితే యోగి మాత్రం తనకు మరింత ఉన్నత పదవులను అధిష్టించాలనే ఆసక్తి లేదని తేల్చి చెప్పాడు.

యూపీ సీఎం పీఠం మీద కూడా ఎక్కువ కాలం కూర్చోవాలని లేదన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పటి వరకూ దక్కిన అవకాశాలు కూడా తన లక్ అని, ఈ విషయంలో మోడీకి, షాకి థ్యాంక్స్ అని.. మఠానికి వెళ్లిపోవడమే తన తదుపరి ఆలోచన అని యోగి చెప్పారు. మరి యూపీ సీఎం పీఠాన్ని అధీష్టించి సరిగా నాలుగైదు నెలలైనా కాలేదు.. అంతలోనే.. యోగి మఠం పేరెత్తడం గమనార్హమే.

ఒకవైపు బీజేపీ వాళ్లేమో యోగిలో భావి ప్రధానిని చూస్తుంటే.. ఆయన మాత్రం మఠం అంటున్నారు. ఇక మీడియాలో కూడా ఈ మధ్యకాలంలో యోగి హడావుడి బాగా తగ్గింది. యూపీలో యోగి తీవ్రమైన మార్పులేవీ తీసుకురాలేకపోతున్న వైనం స్పష్టం అవుతోంది.

రౌడీయిజం కొనసాగుతోంది.. ఇప్పుడది బీజేపీ వాళ్ల చేతుల్లోకి వచ్చిందంతే. బీజేపీకి చెందిన వారి రౌడీయిజాన్ని మీడియా ముఖంగా అడ్డుకున్న పోలీసాఫీసర్ కు బదిలీ తప్పలేదు.. ఎవరి పాలనలో ఉన్నా, యోగులు సన్యాసాలు పాలించినా, యూపీలో పరిస్థితులు మామూలే.. అనే స్పష్టత వస్తోంది.

Show comments