మోడీ సత్తా.. ఇప్పుడు దాని గురించి మాట్లాడొద్దు..!

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంట్లో జరిగిన ఫంక్షన్లకు ఎందుకెళ్లారయ్యా.. అంటే, అది వ్యూహాత్మకం అన్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంట్లో వాళ్లతో అంత సఖ్యత ఏంటయ్యా.. అంటే అవసరమైనప్పుడు ఇలాంటివి బాగా ఉపయోగపడతాయన్నారు... అంతలా విదేశాలు చక్కర్లు కొట్టడం ఎందుకు అంటే.. అది మోడీ విదేశాంగ వ్యూహం అని అన్నారు.. ప్రపంచంపై భారత్ కు పట్టు దొరికేందుకు మోడీ అలాంటి పర్యటనలు చేస్తున్నాడన్నారు. 

మరి మోడీ విదేశాంగ నీతికి దక్కుతున్న ఫలితాలు ఏమిటో అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. మరి ఇప్పుడు కుల్ భూషణ్ జాదవ్ కు పాకిస్తాన్ సైనిక కోర్టు విధించిన మరణశిక్షను ఏ విధంగా ఆపబోతున్నారు? మూడేళ్ల దౌత్యనీతి.. విదేశాంగ విధానం.. ఇప్పుడు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది? పాకిస్తాన్ ప్రధాని కుటుంబంతో వ్యక్తిగతంగా బంధాన్ని పెంచేసుకున్న మోడీ.. ఇప్పుడు కుల్ భూషణ్ ప్రాణాలను కాపాడగలడా? అంటే.. మాత్రం కమలనాథులు నీళ్లు నములుతున్నారు. 

అబ్బే.. పాకిస్తాన్ పురుగు కన్నా హీనం. దాని తీరు అంతే... అంటున్నారు! ఇప్పుడు పాక్ తో పద్ధతిగా మాట్లాడి కుల్ భూషణ్ ఉరిశిక్షను రద్దు చేయిస్తారా, లేక హెచ్చరించి, బెదిరించి... అతడిని బయటకు తీసుకొస్తారా? అనేది మోడీ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఇది యూపీఏ జమానా కాదు.. ప్రభుత్వంపై రాళ్లేస్తూ కూర్చోవడానికి. చేతగానితనం, దద్దమ్మలు.. అంటూ కాంగ్రెస్సోళ్లను తిట్టారు కదా.. ప్రజలు కూడా అలానే అనుకుని వాళ్లను పక్కన పెట్టారు. మరి మూడేళ్ల నుంచి పాక్ విషయంలో మోడీ ప్రభుత్వ మగతనం ఎంతో దేశం గమనిస్తూనే ఉంది. సర్జికల్ దాడులు అంటూ.. ఎన్నికల రాజకీయం చేయడాన్ని పక్కన పెడితే ఆ తర్వాత అనేక మంది భారతీయ సైనికుల ప్రాణాలను పాక్ కు అప్పగించడం గమనిస్తే, కాశ్మీర్ లో అధికారాన్ని చేపట్టాకా కూడా అక్కడ అల్ల కల్లోలాన్ని అణువంతైనా తగ్గించలేక.. ఇంకా పెంచడాన్ని చూసుకుంటే.. పాక్ పై భారత్ ఏ విషయంలోనూ, ఏ విధంగానూ పైచేయి సాధించిన దాఖలాలు లేవు. 

ఇప్పుడు కుల్ భూషణ్ జాదవ్ ను ఉరిశిక్ష నుంచి కాపాడటమే కాదు, అతడు పాక్ బంధీఖానా నుంచి కూడా బయటకు తీసుకురావాల్సి ఉంది. ఉరిశిక్షను తప్పించినా అది భారత విజయం అయిపోదు. ఎందుకంటే.. ఉరిశిక్ష కన్నా పాక్ జైళ్లలో జీవితాంతం మగ్గడం అత్యంత కఠినమైన శిక్ష. దేశ ప్రజలపై నోట్లరద్దు ప్రయోగాలు చేయడం కాదు.. ఇప్పుడు మోడీ సత్తాకు అసలైన పరీక్ష ఎదురవుతోంది. అదెంత ఉందో చూద్దాం.

Show comments