కృష్ణ.. కృష్ణ.. ఇవేం మాటలు..?!

బీజేపీకి బుద్ధి లేదు.. కాంగ్రెస్ మాజీలకు సిగ్గులేదు.. అన్నట్టుగా తయారైంది పరిస్థితి. కర్ణాటకలో గెలుస్తాం.. గెలుస్తాం.. వచ్చే ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. అంటూ సవాళ్లు చేస్తున్న భారతీయ జనతా పార్టీ గెలవడానికి వెళుతున్న రూటు ఏ మాత్రం సవ్యంగా లేదు. ఇప్పటి వరకూ దాదాపు అరడజను మంది కాంగ్రెస్ సీనియర్ల కు కాషాయ కండువా కప్పింది కమలం పార్టీ. వాళ్లందరినీ చేర్చేసుకుని.. అధికారం సాధించబోతున్నాం.. అని బీజేపీ సవాళ్లు చేయడం అక్కడి లోకల్ జనాలకు కూడా విచిత్రంగా మారింది.

ఆల్రెడీ కర్ణాటక బీజేపీ నిండా అవినీతి మకిలి ఉంది. దానికి తోడూ నాలుగేళ్లుగా కాంగ్రెస్ లో అధికారాన్ని అనుభవించిన వాళ్లను ఇప్పుడు బీజేపీ చేర్చుకుంటోంది. అదేమంటే.. అదే తమ చాణక్యం అంటోంది. ఇప్పటి వరకూ చాలామందే కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ కాంగ్రెస్ ఓడిపోతుంది.. ఇప్పుడే బీజేపీ వైపు వెళితే.. ఒక ఏడాది వరకూ మిన్నకుండినా.. తర్వాత కమలం అధికారంలోకి వస్తుంది.. చక్రం తిప్పొచ్చు అనేది ఈ ఫిరాయింపు నేతల లెక్క.

మరి తమ శక్తితో గెలవాల్సిన బీజేపీ.. కాంగ్రెస్ లోని వారందరినీ తెచ్చుకుని గెలవడం కోసం యత్నిస్తోంది. ఇప్పటికే ఎస్ఎం కృష్ణ వంటి వాళ్లను కూడా చేర్చుకుని భారతీయ జనతా పార్టీ ఆనందం పొందింది. రెబల్ స్టార్ అంబరీష్ తో సహా అనేక మంది కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరనున్నారనే మాటా వినిపిస్తోంది. మరి ఇలా చేరిన వారు మాట్లాడుతున్న మాటలే మరీ విడ్డూరంగా ఉంటున్నాయి.

బీజేపీలో చేరిన సందర్భంగా వరసగా మీడియాకు ఇంటర్వ్యులు ఇస్తున్న కృష్ణ అయితే.. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై ధ్వజమెత్తాడు! ఆ పార్టీది అనువంశిక సిద్ధాంతం అంటూ విరుచుకుపడ్డాడు. మరి కాంగ్రెస్ వి వారసత్వ రాజకీయాలు అని కృష్ణ కు ఇప్పుడే తెలిసిందా? యాభై సంవత్సరాల నుంచి ఆ పార్టీలో పని చేసిన పెద్ద మనిషి ఈయన. ఆ యాభై ఏళ్లూ కాంగ్రెస్ లో నడిచిన రాజకీయాలు ఏవి? అప్పుడంతా అభ్యంతరం అనిపించలేదా? ఇప్పుడే అనిపిస్తోందా?

 అంత వరకూ ఎందుకు.. ఇప్పుడు కృష్ణ బీజేపీలో చేరిందే ఆయన వారసుల కోసం అనే మాట వినిపిస్తోంది. కృష్ణ కూతురు బీజేపీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఖాయమైందని సమాచారం. కృష్ణకు గవర్నర్ పదవి, ఆయన కూతురికి ఎమ్మెల్యే టికెట్.. దీంతోనే ఈయన పార్టీ మారాడు, కృష్ణ వెనుక ఉన్న కుల బలం కోసం బీజేపీ చేర్చుకుంటోందని కర్ణాటకలోని సామాన్యుడు అంటుంటే.. ఈ ముసలాయన మాత్రం.. ‘వారసత్వ’ రాజకీయాలు అంటూ ధ్వజమెత్తుతున్నాడు. జనాలు మరీ అంతా మూర్ఖులని ఈ నేతల అభిప్రాయమా?

Show comments