ధృవను వదిలేసారా?

గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ధృవ సంగతేమిటి? అసలు దాని లక్ష్యం ఏమిటి? అది సాధించినట్లేనా? తెలుగు సినిమాకు మూలాలు బీసీ సెంటర్లలో వున్నాయని తెలిసి కూడా, కేవలం ఓవర్ సీస్ ను, ట్వీట్లను నమ్ముకుని ప్రచారం సాగించే ఎత్తుగడకు నిర్మాత అల్లు అరవింద్ ఎందుకు తల ఊపినట్లు? గీతా ఆర్ట్స్ సినిమాలు అన్నింటిని డివైడ్ టాక్ వచ్చినా కూడా నిలబెట్టుకోవడంలో చూపించిన చాకచక్యం ఈ సినిమా విషయంలో ఎందుకు కనిపించడం లేదు? అసలు గీతా ఆర్ట్స్ సినిమా, వాళ్ల స్వంత విడుదల అంటే కలెక్షన్ల రిపోర్టులు సిబిఐ నివేదికలంత గుప్తంగా వుంటాయి. కానీ ధృవ ఫిగర్స్ ఎప్పటిప్పుడు జనం ముందుకు ఎందుకు వచ్చేస్తున్నాయి? నైజాం లాంటి ఏరియా రోజుకు ఇరవై లక్షలు డ్రాప్ కావడం ఏమిటి? జిల్లాల్లో రోజుకు మొక్కుబడిగా లక్ష వంతున షేర్ ఏమిటి?

అదృష్టమో, ప్లానింగ్ నో మొత్తానికి ధృవకు పోటీగా మరే సినిమా అదే వారం కానీ, మలి వారం కానీ విడుదల కాలేదు కాబట్టి సరిపోయింది. అదే కనుక ముందు అనుకున్న ప్రకారం సింగం 3 ఈ శుక్రవారం విడుదలై వుంటే..? ధృవ సినిమా తొలివారం వసూళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేదేమో?

ఇప్పటి వరకు ధృవక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు 30 కోట్లు దాటలేదు. మరి ఈవారం పెద్ద సినిమాలు ఏవీ లేవు అందువల్ల కలెక్షన్లు వుంటాయోమే అనుకునే వీలు కూడా కనిపించం లేదు. ఎందుకంటే గత మూడు రోజులుగా ధృవకు జిల్లాలో జస్ట్ లక్ష వంతునే కలెక్షన్లు వస్తున్నాయి. నైజాంలో ఏడవ రోజున నలభై లక్షలు కలెక్షన్ వచ్చింది. పోనీ ఇదే తీరు కొనసాగుతుంది అనుకుంటే, మలివారం మొత్తానికి మరో అయిదారు కోట్ల జోడించే వీలు వుంటుందేమో? మరి ఆ తరువాత? మూడో వారం కూడా ధృవ కలెక్షన్లు వుంటాయా? ఓవర్ సీస్ తో కలుపుకుంటే అప్పుటికి నలభై కోట్లను బొటాబొటీగా దాటే పరిస్థితి. 
ఫస్ట్ వీకెండ్ కు..ధృవ కలెక్షన్లు ఇలా వున్నాయి.

నైజాం 10.69
వైజాగ్ 3.90
సీడెడ్ 5.05
నెల్లూరు 0.98
వెస్ట్ 2.06
ఈస్ట్ 2.34
కృష్ణ 2.17
గుంటూరు 2.02

ఇదీ ఉభయ తెలుగు రాష్ట్రాల పరిస్థితి. కానీ ధృవ టీమ్ వ్యవహారం వేరుగా వుంది. ఈ కలెక్షన్ల మీద ధృవ టీమ్ దృష్టి లేదు. ఎంతసేపూ ఓవర్ సీస్..ఓవర్ సీస్..అక్కడ వన్ మిలియన్ క్లబ్ లో చేరాలి. నాని, నిఖిల్ చేరిపోయారు. రామ్ చరణ్ చేరకపోవడం ఏమిటి? ఆ టార్గెట్ దిశగా చేసిన కృష్టి, ఇక్కడ డొమస్టిక్ మార్కెట్ లో బ్రేక్ ఈవెన్ పై పెట్టినట్లు కనిపించడం లేదు. 

నిజానికి ధృవ ప్రాజెక్టు ఏ పరిస్థితిలో ప్రారంభమైంది? బ్రూస్ లీ ఘోర పరాజయం నేపథ్యంలో. నిజానికి థని ఒరువన్ సినిమాను కొన్నది డివివి దానయ్య. కానీ బ్రూస్ లీ పరాజయం తరువాత, పవన్ వెళ్లి అన్నను, చరణ్ ను పరామర్శించిన తరువాత, అల్లు అరవింద్ గారు, చరణ్ కు విజయాన్నిచ్చే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. ధని ఒరువన్ హక్కులను దానయ్య నుంచి తాను తీసుకుని, ఎన్ వి ప్రసాద్ తో కలిసి నిర్మించడం స్టార్ట్ చేసారు. నిర్మాణం ప్రారంభమైన కొన్నాళ్లకే రకరకాల గ్యాసిప్ లు. చరణ్ తో సమస్యలనీ, కాశ్మీర్ షెడ్యూలు అనుకున్నట్లు జరగలేదనీ, సినిమా విషయంలో అరవింద్ గారి నిర్ణయాలకు చరణ్ ఓకె అనడం లేదని, చరణ్ తన టీమ్ తప్ప, గీతా టీమ్ ను వద్దంటున్నారని ఇలా రకరకాలుగా. అవన్నీ అప్పటికి గ్యాసిప్ లే. 

కానీ సినిమా విడుదలైన తరువాత వ్యవహారం చూస్తుంటే ఈ సినిమా గురించి అస్సలు గీతా ఆర్ట్స్ ప్రమేయం ఎక్కడన్నా వుందా అన్న అనుమానంగా వుంది. సినిమా విడుదలకు ముందు చరణ్ హడావుడిగా మీడియాను కలిసి అమెరికా వెళ్లిపోయారు. అక్కడ హల్ చల్ చేసారు. ఆ హల్ చల్ అంతా ట్విట్టర్, ఫేస్ బుక్ ల్లోనే. పోనీ అదే ప్రచారాన్ని ఇక్కడ బీసీ సెంటర్లకు కూడా ఏదో విధంగా తీసుకెళ్లారా? అంటే అదీ లేదు. ఆ తరువాత చరణ్ వచ్చారు. మొక్కుబడిగా ఒకరిద్దర్ని కలిసారు. అంతే. ఫినిష్. ఒక ప్లాన్ ప్రకారం సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినట్లు కానీ, జరుగుతున్నట్లు కానీ కనిపించడం లేదు. 

మరోపక్క అసలు అరవింద్ గారు ఆయన పనుల్లో ఆయన బిజీ అయిపోయారు. చరణ్ తన మానాన తను సైలెంట్ అయ్యారు. మరి ధృవ ఎవరికి పుట్టిన బిడ్డ? అన్నట్లు వుంది. పోనీ గీతా స్వంతమే అంతా..వచ్చినా? రాకున్నా? అనుకోవడానికి లేదు. గీతా వరకు నైజాంలో ఓ పన్నెండు పదమూడు, శాటిలైట్ ఓ పది, సీడెడ్ ఓ అయిదు, మిగిలిన ఏరియాలు ఓ ఏడెనిమిది వచ్చాయి. అమ్మిన ఏరియాలు ఓ పదకోండు అంటే నలభై దాటినట్లు. అక్కడికి ఇంకా చాలా రావాలి కానీ, వాళ్లలో వాళ్లు సర్దుకోగలరు.

కానీ బయ్యర్ల సంగతేమిట? వైజాగ్ అమ్మారు. అయిదు కోట్లకు పైగా. అక్కడ ఇంకా ఖర్చులు కాకుండా కోటికి పైగా రావాలి. అది దాదాపు అసాధ్యమే. ఇక ఓవర్ సీస్ సంగతి తెలిసిందే. అక్కడ వన్ మిలియన్ దాటింది. రామ్ చరణ్ హ్యాపీ. కానీ మరో అర మిలియన్ వస్తే కానీ అక్కడి బయ్యర్ సేఫ్ కారు. 

ఇలాంటి పరిస్థితుల్లో మరో నాలుగువారాల వరకు మార్కెట్ లో భారీ సినిమా ఏదీ లేని నేపథ్యంలో, ధృవ కలెక్షన్లు పెంచే మార్గాలు ఎందుకు అన్వేషించడం లేదు. గతంలో కొన్ని సినిమాలకు చేసినట్లు విశాఖలోనో మరో చోటో ఫంక్షన్ చేసే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ధృవ విషయంలో?

Show comments