సమాధిపై కొట్టిన శశికళ: కోపమెవరిపైన.?

'అమ్మ' జయలలిత సమాధిపైన 'చిన్నమ్మ' శశికళ బలంగా కొట్టారు. ఒకసారి కాదు, మొత్తం మూడుసార్లు ఆమె అలా కొట్టారు. కొట్టిన తర్వాత, చేతిని శుభ్రం (దులుపుకుని) చేసుకున్నారు. ఆ కాస్సేపు, శశికళ హావభావాలు గమనిస్తే, ఆమె ఎంత 'కసి'తో, 'ఆగ్రహం'తో వున్నారో స్పష్టమవుతుంది. 

అంతే మరి, కొద్ది గంటల్లో ముఖ్యమంత్రినవుతాననుకున్న శశికళ ఆశలు అడియాశలైపోయాయి. ముఖ్యమంత్రి పదవి దక్కలేదు సరికదా, బోనస్‌గా నాలుగేళ్ళ జైలు శిక్ష పడింది. అఫ్‌కోర్స్‌, శిక్ష పాతదే అయినా.. ముఖ్యమంత్రి అవుదామనుకున్న సమయంలో, ఈ కేసు కాస్తా ఆమెను నిట్టనిలువునా కూల్చేసింది. ఇంకో పదేళ్ళపాటు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితిని తీసుకొచ్చింది. 

ఇంతకీ, శశికళ ఆగ్రహావేశాలు చూపించిందెవరిపైన.? నిజానికి, జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ కూడా నిందితురాలు. జయలలితతో కలిసి శశికళ మరికొందరు అక్రమాస్తులు కూడగట్టారన్నది ఈ కేసు సారాంశం. జయలలిత హ్యాపీగా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారనీ, తాను అనవసరంగా ఇరుక్కుపోయానని భావిస్తూ, శశికళ ఆ ఆగ్రహంతో జయలలిత సమాధి మీద బలంగా కొట్టారని అనుకోవాలా.? లేదంటే, ఈ కేసులోంచి బయటపడి జయలలితకు తనతోపాటుగా క్లీన్‌ చిట్‌ తీసుకొస్తానని శశికళ శపథం చేశారనుకోవాలా.? ఇవేవీ కావు, అన్నాడీఎంకే పార్టీకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన పన్నీర్‌ సెల్వంని రాజకీయంగా దెబ్బకొడ్తానని శశికళ శపథం చేశారని అర్థం చేసుకోవాలా.? ఏమో మరి, శశికళకే తెలియాలి. 

చెన్నయ్‌ నుంచి బెంగళూరుకు బయల్దేరిన శశికళ, ముందుగా చెన్నయ్‌లోని జయలలిత సమాధివద్ద ఆగి, నివాళులర్పించిన ఈ క్రమంలో ఈ 'కొట్టుడు' కార్యక్రమం జరిగింది.

Show comments