టీడీపీకి షాక్‌: 'శిల్పా' జంప్‌.. సంపూర్ణం

శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీని వీడటం అప్పట్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్‌. ఆ షాక్‌తో పోల్చితే, శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీని వీడనుండడం పెద్ద షాక్‌గా చెప్పుకోవాల్సిన పనిలేదేమో.! అన్నదమ్ములతో రాజకీయం చేయడం, అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టడం, కుదరకపోతే అన్న పేరు చెప్పి తమ్ముడ్ని.. తమ్ముడి పేరు చెప్పి అన్ననీ రాజకీయంగా వేధించడం, అవమానించడం.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి వెన్నతో పెట్టిన విద్యే. 

నందమూరి కుటుంబంలోనే చంద్రబాబు రాజకీయంగా చిచ్చుపెట్టిన సందర్భాలెన్నో వున్నాయి. అలాంటప్పుడు శిల్పా కుటుంబంలో 'చిచ్చు' ఆయనకి పెద్ద కష్టమేమీ కాదు. అయితే, ఆ చిచ్చు ఫలించలేదు. శిల్పామోహన్‌రెడ్డి టీడీపీని వీడాక, ఆయన మీద శిల్పా చక్రపాణిరెడ్డితో విమర్శలు చేయించాలనుకున్నారు చంద్రబాబు. 'అన్న, టీడీపీని వీడినా నేను పార్టీ మారను..' అని గతంలో చెప్పిన శిల్పా చక్రపాణిరెడ్డికి 'వాస్తవం' తొందరగానే అర్థమయ్యింది. 

నంద్యాల ఉప ఎన్నిక ముంచుకొచ్చిన దరిమిలా, నంద్యాలలో ఈక్వేషన్స్‌ మారిపోయాయి. భూమా కుటుంబానికి చంద్రబాబు సర్కార్‌ ఇస్తోన్న ఎనలేని ప్రాధాన్యత, ఈ క్రమంలో శిల్పా అనుచరుల్ని లైట్‌ తీసుకుంటున్న వైనం.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని, శిల్పా చక్రపాణిరెడ్డి కూడా టీడీపీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు. నిన్నటికీ ఈ రోజుకీ ఆయన మాటల్లో చాలా తేడా. 'టీడీపీని వీడాలనుకోవడంలేదు..' అని చెప్పిన ఆయన, తెల్లారేసరికి మాట మార్చేశారు. 

'నన్ను కలుపుకుపోవట్లేదు..' అని నిన్న శిల్పా చక్రపాణిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 'అదంతా అబద్ధం..' అంటూ నిన్ననే మంత్రి భూమా అఖిల ప్రియ ఖండించేశారు. అధిష్టానం తరఫున శిల్పా చక్రపాణిరెడ్డితో మంతనాలు జరిపేందుకూ ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఇక చేసేది లేక శిల్పా చక్రపాణిరెడ్డి, సోదరుడు శిల్పా మోహన్‌రెడ్డితో కలిసి మంతనాలు జరిపారు. వైఎస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 

రేపు నంద్యాలలో వైఎస్‌ జగన్‌ బహిరంగ సభ నిర్వహించనుండగా, ఈ రోజు సాయంత్రమే జగన్‌ని కలవాలన్నది శిల్పా చక్రపాణిరెడ్డి వ్యూహం. రేపు భారీ స్థాయిలో అనుచరుల్ని వెంటేసుకుని నంద్యాలలో జగన్‌ బహిరంగ సభ వేదికగా వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోవాలని చక్రపాణిరెడ్డి భావిస్తున్నారు. మొత్తమ్మీద, శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీని వీడనుండడంతో వైఎస్సార్సీపీలో 'శిల్పా వర్గం' చేరిక సంపూర్ణం కానుందన్నమాట.

Show comments