లాబీయింగ్ లో బిజీగా కంభంపాటి!

ప్రధాని నరేంద్రమోడీ.. త్వరలోనే కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. ఏపీ నుంచి అని క్లెయిం చేయలేం గానీ.. ఏపీకి చెందిన ఒక కేంద్రమంత్రి పోస్టు ఖాళీ అయింది. ఈ సమయంలో కాస్త గట్టిగా మన ప్రయత్నం మనం చేసుకుంటే.. దానికి అంతో ఇంతో భగవదనుగ్రహం కూడా తోడయి...

.. ప్రస్తుతం ఈ రకంగా సాగుతున్నట్లున్నాయి విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఆలోచనలు. సరిగ్గా ఈ సమయంలో హస్తినాపురంలో కాస్త గట్టిగా లాబీయింగ్ చేసుకోగలిగితే.. కేబినెట్ బెర్తు తప్పకుండా లభిస్తుందనే ఆశతో ఆయన ఉన్నారు. కొత్త గనుక.. తొలిసారే కేబినెట్ పదవి రాకపోయినా.. కనీసం సహాయ మంత్రి పదవి అయినా ఏదోటి కట్టబెడతారు లెమ్మని ఆశల  పల్లకిలో ఊరేగుతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం సీటు ఖాళీ చేసిన వెంకయ్యనాయుడు ద్వారానే ఆయన ప్రధానికి సిఫారసు చేయించుకుని మంత్రి పదవి పొందడానికి తపన పడుతున్నట్లు తెలుస్తోంది. కంభంపాటి హరిబాబు.. వెంకయ్య బాగానే సన్నిహితులు, పైగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. అందువలన వెంకయ్య ద్వారా ఖాళీ అయిన సీటును... అదే సామాజిక వర్గానికి చెందిన తనకు కట్టబెడితే.. కులాల సమీకరణాలు కూడా సమతుల్యతతో ఉంటాయనేలా తన ఆశలను ఆయన ప్రచారంలోకి తెస్తున్నారట. 

నిజానికి వెంకయ్యనాయుడు పదవిలో ఉన్న రోజుల్లోనే ఏపీ నుంచి ఒక భాజపా ఎంపీకి కేంద్రమంత్రి పదవి ఇవ్వాలనే చర్చ కొన్నాళ్లు చురుగ్గా నడిచింది. అప్పట్లో కూడా కంభంపాటి హరిబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ.. అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఎటూ పోస్టు ఖాళీ అయింది గనుక.. తనకు ఛాన్స్ తప్పక వస్తుందని ఆయన ఆశిస్తున్నారట. కేవలం వెంకయ్యనాయుడు ద్వారా మాత్రమే కాకుండా.. కేంద్రంలో తనకు పరిచయం ఉన్న ఇతర నేతలు, ప్రస్తుతం కేంద్ర భాజపా రాజకీయాల్లో కీలకంగా ఉన్న రాంమాధవ్ ద్వారా కూడా కంభంపాటి తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 

తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా అని పైకి చెప్పకపోయినప్పటికీ.. అన్ని సీట్లకు పోటీచేయగలిగే స్థాయి రాజకీయ పార్టీగా ఏపీలో అవతరించాలని కలలు కంటున్న భాజపా.. రెండు దఫాలుగా పార్టీ అధ్యక్షుడుగా చేసినా.. పార్టీ వైభోగాన్ని ఏమీ పెంచలేని కంభంపాటి చేతిలో మంత్రి పదవిని పెడుతుందా అనేది అనుమానమే. దానికి బదులుగా చంద్రబాబునాయుడుకు పొసగని మరో నేత ఎవరినైనా కొత్తగా కేబినెట్ లోకి తీసుకుని, ఆ తర్వాత వారిని రాజ్యసభ ఎంపీని చేయడం ద్వారా.. భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తుందేమో అనే ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. 

 

Show comments