బాహుబలి 2 అక్కడ డౌన్ అయింది

ఇలా అంటే ఫక్కున నవ్వడం గ్యారంటీ. ఎందుకంటే బాహుబలి 2 సృష్టిస్తున్న సంచలనాలు ఇన్నీ అన్నీ కావు. అలాంటిది డౌన్ అవ్వడం ఏమిటి? కానీ ఒక్కోసారి ఒక్కోచోట తప్పదు. బాహుబలి 2 విషయంలో అదే జరిగింది. అయితే అది ఆంధ్ర, తెలంగాణల్లో కాదు. కర్ణాటకలో. బాహుబలి 2 అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. తొలి భాగం ఎంత వసూలు చేసిందో, దానికి కాస్త అటుగానే రెండో భాగం రేటుగా ఫిక్స్ చేసి అమ్మకాలు జరిపారు. కొన్నవాళ్లు ఆనందంగా కొన్నారు కూడా. అయితే ఇలా అమ్మకాలు జరుగుతుండగా కర్ణాటక మాత్రం పెండింగ్ లో వుంది. ఇప్పుడు సినిమాకు సూపర్ బజ్ వచ్చింది. కానీ కర్ణాటకకు మాత్రం నిర్మాతలు చెబుతున్న రేటు రావడం లేదట. 

దానికి కారణం మరేమీ కాదు. కర్ణాటకలో టికెట్ ల రేట్లపై అక్కడ ప్రభుత్వం క్యాప్ బిగించడమే. ఇంతకు మించిన ధరలకు అమ్మరాదు అని రూల్ పెట్టడమే. మామూలు టికెట్ రేట్లకు అమ్మితే బాహుబలి 2 బయ్యర్లు ఎవరూ ఎక్కడా గట్టెక్కరు. కనీసం వారం నుంచి రెండు వారాలు యూనిఫారమ్ రేటు అది కూడా సెంటర్ ను బట్టి రెండు వందల నుంచి నాలుగు వందలు అమ్మాల్సిందే. అయితే కర్ణాటకలో ఇప్పుడు అంత రేంజ్ సాధ్యం కాదు. అందుకే అక్కడ నిర్మాతలు చెబుతున్న రేటుకు ఇంకా డిస్కషన్ లో వుండిపోయింది తప్ప, కొనుగోలు ఫైనల్ కాలేదు.

బాహుబలి పార్ట్ వన్ దగ్గర దగ్గర 40 కోట్ల షేర వసూలు చేసింది కర్ణాటకలో. మరి ఇప్పుడు అదే రేంజ్ కు పది శాతం కలిపి మరీ రేటు చెబుతున్నారని తెలుస్తోంది. మరి బయ్యర్లు ఎక్కడ ఏ రేటుకు ఫిక్స్ అవుతారో చూడాలి. ఆ ఒక్క ఏరియా మినహా మిగిలినవి అన్నీ ఫైనల్ అయిపోయాయి. రాజమౌళి సన్నిహితుడు సాయి కొర్రపాటినే సీడెడ్, కృష్ణ, వైజాగ్ ఏరియాలను తీసుకున్నారు.

Show comments