టీవీ9 స్టుపిడ్ ఇంటర్వ్యూ.. షాకిచ్చిన ధనుష్!

ఆ చానల్ అంతే.. ఆ చానల్ యాంకర్లూ అంతే.. ఎంత లేకిగా మాట్లాడితే.. తమలోని శాడిజాన్ని ఎంతగా ప్రదర్శిస్తే.. అంత గ్రేట్ అని అనుకుంటారు. వాళ్లు చేసే ఇంటర్వ్యూలలో ఒక్కటంటే ఒక్కటీ అర్థవంతంగా ఉండవు. ఒక్కోడిది ఒక్కో టైపు శాడిజం. ఆ మధ్య ప్రవచనాలు చెప్పుకునే ఒక పెద్దాయనను కూర్చోబెట్టి.. ఏదో గ్యాంగ్ స్టర్ ను, వెయ్యికోట్లు అవినీతి చేసి దొరికిన లంచగొండి ఆఫీసర్ ను, తన శాఖలో పెద్ద స్కామ్ లో దొరికిపోయిన మంత్రిగారిని.. అడిగినట్టుగా ప్రశ్నలు అడిగాడు ఒకడు. ఇక ఎన్‌కౌంటర్ తో పేరుతో మరోసోది. అవతలవాళ్లను మాట్లాడనీయకుండా.. వాళ్లు సమాధానం చెబుతున్నప్పుడే అడ్డంగా మరో ప్రశ్న అడగడం, తన వెకిలి వ్యంగ్యాన్ని ఒలికిపోయాడమే ‘ఎన్‌కౌంటర్’ చేయడంగా ఫీలవుతున్నట్టుగా ఉన్నారు.

ఇక మెరుగైన సమాజం కోసం అందరికీ నీతులు చెప్పే ఆ చానల్ ఈ మధ్య ఒక ప్రోగ్రామ్ మొదలుపెట్టింది.. ఏది నిజం, ఏది అబద్ధం.. అంటూ, వెబ్ సైట్లలో ప్రచురితం అవుతున్న వార్తలన్నీ ఏరి.. వాటిని గంపగుత్తగా జనాలకు అందిస్తూ.. గాసిప్స్ ను మరింతగా స్ప్రెడ్ చేస్తూ.. వీక్షకులను ఆకట్టుకునే యత్నం చేస్తోంది. దూసుకుపోతున్న వెబ్ ప్రపంచంతో పోటీ పడలేక.. వెబ్ సైట్లలోని వార్తలనే చూపిస్తూ.. తన కడుపునింపుకునే యత్నం చేస్తోంది టీవీ9.

ఈ సంగతిలా ఉంటే.. తాజాగా తమిళ హీరో దనుష్ ను సదరు చానల్ ఇంటర్వ్యూ చేసిన తీరు మరోసారి తనదైన లేకి తనాన్ని చాటి చెప్పేలా ఉంది. ఆ యాంకరమ్మ శాడిజాన్ని భరించలేక.. ధనుష్ ‘స్టుపిడ్ ఇంటర్వ్యూ..’అంటూ మైక్ విసిరి కొట్టాడంటే వీళ్ల హింస ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముందుగా ధనుష్ ను సదరు యాంకరమ్మ అడిగిన ప్రశ్నలేంటో తెలుసా? ‘టాలీవుడ్ డ్రగ్స్ ఇష్యూ గురించి స్పందించండి..’ అని. అసలు టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కు ధనుష్ కు ఏం సంబంధం?

అతడు తెలుగువాడు కాదు, టాలీవుడ్ వాడు కాదు, తెలుగు హీరోలతో పెద్దగా సంబంధబాంధవ్యాలు ఉన్నవాడు కాదు, ఈ చానల్ కు మాత్రం ఏదో ఆశ. ధనుష్ ఏదైనా అనాలి, అనడు కాబట్టి అనిపించాలి. ఈ కొశ్చన్ ఒక ఎత్తు.

రెండో ప్రశ్న ఏంటో తెలుసా..‘మీ వ్యక్తిగత జీవితాన్ని వరస స్కాండిల్స్ కుదిపేస్తున్నట్టున్నాయే..’ అనేది. నివ్వెరపోయాడు ధనుష్. ‘స్కాండిల్సా..’ అని నోరు తెరిచాడు. చివరకు యాంకరమ్మ సర్దిచెప్పగా..‘మీ వ్యక్తిగత జీవితం గురించి నేను కామెంట్ చేయను.. నా గురించి కూడా చేయొద్దు..’ అన్నాడు. ‘మీరు పాపులర్ కదా..’ అని చెప్పుకొచ్చింది యాం‘కర్మ’.

అంతటిలో ఆగలేదు.. ‘మీ గురించి స్కాండల్ వీడియోలు బయటకు వచ్చాయి...’ అని మరో బాంబు. మళ్లీ ధనుష్ నివ్వెరపాటు..‘వీడియోలా..?’ అని ప్రశ్న. బహుశా.. సుచీలీక్స్ గురించి యాంకర్మ అడగాలని అనుకుందేమో. సుచీ కూడా ఏవో ఫొటోలు విడుదల చేసిందికానీ, ధనుష్ వీడియోలేవీ రాలేదు, అసలు సుచీనే పెద్ద ఫార్సు.. ఇక దాన్ని పట్టుకుని ధనుష్ ను నిగ్గదీసింది టీవీ9.

ఇక్కడితో కూడా ఆగలేదు.. ‘మీ వైవాహిక జీవితం కూడా ఏం బాగున్నట్టుగా లేదు..’ అంటూ మరో ప్రశ్న. ఇక్కడ ధనుష్ కోపం పతాక స్థాయికి చేరింది. మరి టీవీ9కు ఏమైనా తెలిసిందో ఏమో కానీ.. ధనుష్ వైవాహిక జీవితం అయితే పైకి బాగానే కనిపిస్తోంది. అందుకే.. ధనుష్ కూడా దీన్నొక స్టుపిడ్ ఇంటర్వ్యూగా తేల్చి.. మైక్ విసిరికొట్టి వెళ్లిపోయాడు. మళ్లీ ఎలాగోలో అతడిని పిలిపించుకుని, శాంత పరిచి.. ఇంటర్వ్యూను పూర్తి చేసినట్టున్నారు. 

మరి ధనుష్ చేతిలో అన్ని మాటలు అనిపించుకున్నా.. సదరు చానల్ ఆ ఇంటర్వ్యూను యథాతథంగా ప్రసారం చేసింది, జనాలను ఆకట్టుకోవడానికి ఆ చానల్ తిట్టించుకోవడానికి కూడా ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. అదో వ్యాపార రహస్యం!

Show comments