మోదీ వచ్చినా ఇదే నిబంధనా?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జ్వరం, డీహైడ్రేషన్‌ సమస్యలతో చెన్నయ్‌ అపోలో ఆస్పత్రిలో చేరి 26 రోజులైంది. మరో నాలుగైదు రోజులైతే నెల పూర్తవుతుంది. కాని ఆమె వాస్తవ ఆరోగ్య పరిస్థితి ఏమిటనేది ఇప్పటివరకు తెలియదు. డాక్టర్లు చెబుతున్నదాని ప్రకారం...మొత్తం మీద ఆమె బాగానే ఉంది. త్వరలో కోలుకుంటుంది. కాని కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సివస్తుంది. ఇంతకుమించి మరో సమాధానం లేదు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లొచ్చారు. బయటకొచ్చాక వారు చెప్పే మాట 'జయలలిత బాగానే ఉన్నారు. త్వరలోనే కోలుకుంటారు' అని. ఇది వారు జయలలితను చూసి లేదా ఆమెను పరామర్శించి చెబుతున్న మాట కాదు. డాక్టర్లు వారికి చెప్పిన మాట. 

జయ ఆస్పత్రిలో చేరాక ఇప్పటివరకు ఆమెను చూసినవారెవరూ లేరు. చూశామని చెప్పినవారూ లేరు. ఇన్‌చార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు సైతం ముఖ్యమంత్రిని చూడలేదు. చూడలేదంటే చూడనివ్వలేదని అర్థం. గవర్నర్‌నే చూడనివ్వలేదంటే ఎంత సూపర్‌స్టారైనా రజనీకాంత్‌ను చూడనిస్తారా? దత్తత కుమారుడు సుధాకరన్‌ను, మేనకోడలు దీపా జయకుమార్‌ను కూడా చూడనివ్వని సంగతి తెలిసిందే. జయలలిత ఆస్పత్రిలోనే కావేరీ వివాదానికి సంబంధించి మంత్రులతో, అధికారులతో మాట్లాడారని, ఈ వివాదంపై ఢిల్లీలో జరిగిన సమావేశానికి వెళ్లిన బృందానికి తాను చెప్పాలనుకున్న విషయాన్ని డిక్టేట్‌ (టేప్‌ రికార్డర్‌లో) చేశారని అన్నా డీఎంకే నాయకులు చెప్పారు. 

పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై ఆమె అధ్యక్షతన ఆస్పత్రిలోనే సమావేశం జరిగిందన్నారు. కాని ఇదంతా నిజమో కాదో తెలియదు. ఇప్పటివరకు జయలలితకు సంబంధించిన ఎటువంటి ఫోటోలు డీఎంకే సహా ప్రతిపక్షాలన్నీ డిమాండ్‌ చేసినా విడుదల చేయలేదు. ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు కూడా మద్దతు ఇచ్చింది. జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటినుంచి ఇప్పటివరకు రెండుమూడుసార్లకు మించి హెల్త్‌ బులిటన్లు విడుదల చేయలేదు. చివరిసారిగా ఈ నెల పదో తేదీన బులిటన్‌ విడుదలైంది. గత వారం రోజులుగా ఏ సమాచారమూ లేదు. బులిటన్‌ ఎందుకు విడుదల చేయడంలేదని అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఒకవేళ అడిగినా జవాబు రాదు.  

ఈలోగా జయ నిర్వహిస్తున్న శాఖలను ప్రస్తుత ఆర్థిక మంత్రి పన్నీర్‌ శెల్వంకు గవర్నర్‌ అప్పగించారు. జయలలిత ఆదేశాల మేరకు ఈ శాఖలను మంత్రికి అప్పగించినట్లు ఆయన ప్రకటించడం ప్రహసనంగా మారింది. జయలలిత కనీసం మాట్లాడుతున్నారో లేదో, స్పృహలో ఉన్నారో లేదో కూడా తెలియదు. అలాంటి వ్యక్తి తన శాఖలను పన్నీరుశెల్వంకు అప్పగించాలని ఎలా చెబుతారు? ఇదే ప్రశ్న డీఎంకే లేవనెత్తినా జవాబు లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జయలలితను చూడటానికి త్వరలోనే చెన్నయ్‌ వస్తారని కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌, బీజేపీ నాయకులు చెబుతున్నారు. మోదీ ఇదివరకే రావాల్సింది. కాని కొన్ని కారణాలతో ప్రయాణం వాయిదా పడిందన్నారు. 

ఒకవేళ నరేంద్ర మోదీ వచ్చినా ఆయన జయలలితను నేరుగా చూడగలరా? వైద్యులు, అన్నాడీఎంకే నాయకులు అందుకు అనుమతిస్తారా? చెప్పలేం. ప్రధాని కాబట్టి ఆయనకు మినహాయింపు ఉంటుందని అనుకోలేం. అయితే జయలలిత ఆరోగ్యానికి సంబంధించి 'అసలు విషయం' ప్రధానికి తెలియకుండా ఉంటుందా? ఆయనకే కాదు, గవర్నర్‌కు, మంత్రులకు, ముఖ్య నాయకులకు తెలియకుండా ఉండదు. మీడియాకూ తెలిసేవుంటుంది. ఏదో ఒక సోర్స్‌ ద్వారా తెలుసుకోకుండా ఉండరు. కాని ఎవ్వరూ నోరు విప్పేందుకు సాహసించరు. 

జయ ఆరోగ్యంపై ఎవరూ మాట్లాడినా అరెస్టు కాక తప్పదు. సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నవారినే వదలడంలేదంటే నేరుగా మాట్లాడేవారిని ఎందుకు ఉపేక్షిస్తారు? జయ ఆస్పత్రిలో ఉండటం, ఆరోగ్యం గురించి  తెలియకపోవడం తదితర విషయాలపై విదేశీ పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి. ఒక ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై ప్రజాస్వామ్య దేశంలో ఇంత గోప్యత పాటించడం విచిత్రంగా ఉందని ఓ పత్రిక రాసింది. ఏక వ్యక్తి ఆధిపత్యంలో ఉన్న పార్టీలు ఇలాగే ఉంటాయని వ్యాఖ్యానించింది. అసలు విషయం తెలిసేదాకా ఓపిగ్గా వేచి ఉండాల్సిందే. 

Show comments