2019 ఎన్నికలు-టాలీవుడ్ తటస్థం?

ఎన్నికల రణభేరి మోగకున్నా, తెరచాటు సన్నాహాలు అయితే ప్రారంభం అయిపోయాయి. ముందస్తు ఎన్నికలు అన్న మాట వినిపించడం, నియోజక వర్గాల విస్తరణ వుండదని చూచాయిగా తేలడంతో, టికెట్ ల కోసం పోటీ ఎక్కువగా వుండడం తో ఇప్పటి నుంచే ఎవరి రుమాళ్లు వారు రెడీ చేసుకుంటున్నారు. సీట్లలో వేసుకోవడానికి.

అయితే ఈసారి రాబోయే ఎన్నికల్లో టాలీవుడ్ చురుగ్గా పాల్గొంటుందా అన్నది అనుమానమే. ఇంతకు ముందు పోటీ చేసేవారు పోటీ చేసారు. తెలుగుదేశం పార్టీ, వైకాపా రెండింటికీ కూడా ఎవరో ఒకరు మద్దతు ఇచ్చేవారు మద్దతు ఇచ్చారు. ప్రచారం చేసే వారు ప్రచారం చేసారు. అయితే 2014 ఎన్నికల్లో మాదిరిగా ఈసారి సినిమాజనాలు ఎన్నికల్లో హడావుడి చేయకపోవచ్చని వినిపిస్తోంది.

దీనికి కారణం మరేం లేదు. గతంలో అంటే ఒకటే రాష్ట్రం. 2014లో రెండు రాష్ట్రాలు వున్నా, అప్పటికి ఇంకా టీఆర్ఎస్ అధికారం సాధించలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక, టాలీవుడ్ లో పొలిటికల్ హడావుడి తగ్గిపోయింది. టాలీవుడ్ జనాలు చాలా మంది ఇటు తెలుగుదేశంతో, అటు టీఆర్ఎస్ తో సమానమైన సంబంధాలు నెరుపుతున్నారు.

ఇక్కడా అక్కడా కూడా పనులు చక్కబెట్టుకునే చాకచక్యంతో వ్యవహరిస్తున్నారు. అందువల్ల ఎక్కడా బాహాటంగా రాజకీయ హడావుడి కనిపించడం లేదు. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా,  ఒకటే ఇండస్ట్రీ, రెండు పార్టీలు, ఇద్దరు ముఖ్యమంత్రులు వున్నపుడు, ఒకవైపు మొగ్గడం అంత మంచిది కాదన్న ఆలోచనే దీని వెనుక వున్నది.

భవిష్యత్ లో కూడా ఇదే తరహా వైఖరి కొనసాగే అవకాశం వుంది. పూర్తిగా తెలుగుదేశం పార్టీతో మమేకం అయిన మురళీ మోహన్, రాఘవేంద్రరావు లాంటి వాళ్లు ఆంధ్రలో ప్రచారానికి వెళ్తే వెళ్లవచ్చు. కానీ మిగిలిన వారంతా మాత్రం ఈసారి అటు ఇటు చెప్పకుండా వుండే అవకాశమే ఎక్కువగా వుంది. అదే విధంగా పోటీకి కూడా టాలీవుడ్ జనాలు ఎవరూ ఎక్కువగా దిగే అవకాశాలు తక్కువనే తెలుస్తోంది.

బాలయ్య ఈసారి డైరక్ట్ ఎన్నికలో అసెంబ్లీకి కాకుండా, రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా వున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరెవరు పెద్దగా టికెట్ ల కోసం ప్రయత్నాలు కానీ, ప్రచారం కానీ చేసే అవకాశాలు వుండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా వుంటే రెండు రాష్ట్రాల్లో పోటీ జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ అంటున్నారు. కానీ అదికూడా అనుమానమే అని పరిశీలకులు లెక్కలు కడుతున్నారు. మహా అయితే హైదరాబాద్, రంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లోని కొన్ని సీట్లలో పోటీ చేస్తే చేయచ్చేమో కానీ, తెలంగాణ అంతటా రంగంలోకి దిగే పరిస్థితి వుండకపోవచ్చని వినిపిస్తోంది.

హైదరాబాద్ ను డెవలప్ చేసింది నేనే అని సదా చెప్పే చంద్రబాబు సిటీలో ఎప్పడూ మరీ అద్భుతంగా ఫలితాలు సాధించలేదు. అందువల్ల పొత్తుధర్మంలో భాగంగా జనసేనకు వదిలేస్తారని టాక్. అప్పుడు కూడా పవన్ వెనుక నడిచే అభిమానులు ఎంతమంది అయినా వుండొచ్చు కానీ, సినిమా జనాలు ఎంతమంది వుంటారన్నది అనుమానమే.

మొత్తం మీద ఈసారి ఎన్నికల్లో పోటీ హోరా హోరీగా వుంటుంది. కానీ టాలీవుడ్ సందడి మాత్రం చాలా తక్కువంటే చాలా తక్కువగా వుండేలాగే వుంది.

Show comments