అవినీతిలో ఆంధ్ర ఫస్ట్.. మరి తెలంగాణ?

నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్అధ్యయనంలో అవినీతి విషయంలో తొలి ప్లేస్ లో ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. నిప్పును.. అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఉన్న ఈ రాష్ట్రం ఇంతటి దౌర్భాగ్య స్థితిలో నిలిచి అసలు విషయం ఏమిటో తెలియజెప్పింది. మరి అన్నాహజారేకు సంఘీభావంగా జెండా మోసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న రాష్ట్రం స్థితి  ఇలా ఉంటే.. ఇదే సమయంలో ఏపీ దాయాది రాష్ట్రం తెలంగాణ కథ ఏమిటి? అనేది కూడా ఆసక్తికరమైనదే. ఇటీవలే విడివడ్డ ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం అవినీతి విషయంలో ఉన్న పరిస్థితిని గమనించినట్టు అయితే.. తెలంగాణది చాలా బెటర్ పొజిషనే అవుతుంది.

నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ అవినీతిమయమైన పాలన ఉన్న రాష్ట్రాల పై ఇచ్చిన జాబితాను పరిశీలిస్తే.. తెలంగాణ 14 వ స్థానంలో ఉంది. మొత్తం 21 రాష్ట్రాల్లో పాలనపై , పెట్టుబడిదారులకు అనుకూల స్థితిపై జరిగిన ఈ అధ్యయనంలో ఏపీ తొలి స్థానంలో ఉండగా.. తెలంగాణ దీనికి చాలా దూరంగా  14 వ స్థానంలో నిలవడం అంటే గొప్ప కథే. కేసీఆర్ ది కుటుంబ పాలన అని.. ఆయన కుమారుడు, కూతురు, మేనలుళ్లు, తెలంగాణ వాదులు దోచేసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా ఈ అధ్యయనం మాత్రం కేసీఆర్ ప్రభుత్వానికి మంచి స్థితిలో ఉన్నట్టుగా తేల్చింది. 

అ.. అంటే అమరావతి, ఆ.. ఆంధ్రప్రదేశ్ అంటూ ఇన్ని రోజులూ తెలుగుదేశాన్ని, చంద్రబాబును మోసే మీడియా రాసుకొచ్చింది. అయితే నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ అధ్యయనం తర్వాత మాత్రం అ..అంటే అవినీతి, ఆ.. ఆంధ్రప్రదేశ్ అని రాసుకోవాల్సి వస్తోంది. అవినీతి మకిలి అంటని రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. 
ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే.. తమిళనాడులో పెట్టుబడిదారుల పరిస్థితి దారుణంగా ఉందని ఇటీవల ఒక అధ్యయనం ప్రకటించింది. అక్కడ అభివృద్ధికి ద్వారాలు మూసుకుపోయాయని.. జయలలిత ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం అని.. అన్నాడీఎంకే వాళ్లు అడ్డంగా కమిషన్లు వసూలు చేస్తున్నారని విషయాన్ని గట్టిగా చెప్పారు.  అందులో కేవలం తమిళనాడులో పరిస్థితి గురించే వివరించారు. మరే రాష్ట్రం ప్రస్తావనా లేదు.  ఈ విషయంలో ఏపీ తమిళనాడు కన్నా ఒక మెట్టుపైనే ఉందని తేలిందిప్పుడు. 

Show comments