ఒక పక్క మోడీ మధ్యతరగతి, శాలరీడ్ క్లాస్ జనాల కాళ్లు చేతులు కట్టేసి, ముక్కుపిండి, ప్రతి పైసాకు లెక్క తీయించి, ముఫై శాతం మేరకు పన్నులు వసూలు చేసే పనిలో వున్నారు. పోనీ దేశం కోసం మన ఆదాయం నుంచి ఆ మేరకు పన్నలు కడితే తప్పేంటి అనే బ్రాడ్ ఆలోచన చేద్దామన్నా, ఈ రాజకీయ నాయకులు చేస్తున్న పనులు చూస్తుంటే పన్ను కట్టేవాళ్లకు వళ్లు మండిపోతోంది.
జనాలందరకు ఫోన్లు ఫ్రీగా పప్పు బెల్లాల్లా పంచేస్తాం అంటున్నారు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ లెక్కన పావలా ఫోన్ పది రూపాయిలకు అస్మదీయుల ద్వారా కొని ఇటు తమ జేబులు, అటు ప్రజల ఓట్లు కొల్ల గొట్టే పథకం అన్నమాట.
ఇది చాలదన్నట్లు డ్వాక్రా మహిళలు అందరికీ పది వేల రూపాయిల వంతున జస్ట్ పసుపు కుంకుమల కింద ఇచ్చేస్తారట. ఎంత సొమ్ము..ఎందుకోసం. వారికి తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తున్నారు. అభ్యంతరం లేదు. అప్పుడప్పుడు మాఫీ కూడా చేసేస్తున్నారు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఇలా పది వేలు వంతున ఎందుకు ఇవ్వడం? ఓట్ల కోసం కాకుంటే.
అంతగా మంచి స్కీమ్ అని అనిపిస్తే, తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిధిలోంచి ఇచ్చుకోమనండి. జనం కష్టపడి కట్టిన పన్నుల్లోంచి ఇచ్చేసి, తమ పబ్బం గడుపుకుని, ఓట్లు కొల్లగొట్టడం కాకుంటే మరేమిటి ఇదంతా?