ఏపీలో ఒక్కో ఓటు రేటు ఐదు లక్షలు?

స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పంటపండినట్టుగా తెలుస్తోంది. మూడేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఇలాంటి వాళ్లకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో కొత్త పండుగ వచ్చింది. ఏదో దందాలు చేసుకోవడానికి తప్ప..  పెద్దగా ప్రాధాన్యత ఉండని వీళ్లకు ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది! ప్రత్యేకించి తెలుగుదేశం వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ ఉన్న జిల్లాల్లో అయితే వీరి రేటు గట్టిగానే పలుకుతున్నట్టుగా తెలుస్తోంది.

గరిష్టంగా ఒక్కో సభ్యుడికి ఐదులక్షల రూపాయల వరకూ చెల్లించడానికి అభ్యర్థులు సుముఖంగానే కనిపిస్తున్నారు. ప్రత్యేకించి తమకు సరైనబలం లేకపోయినా.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రణరంగంలోకి దిగిన జిల్లాల్లో ఈ వ్యవహారం ఆసక్తికరంగా ఉంది. నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో తెలుగుదేశం పార్టీకి తగినంత బలం లేదు. అయినప్పటికీ.. టీడీపీ అక్కడ అభ్యర్థిని నిలిపింది. విజయం తమదే అని అంటోంది.

ఈ నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో తనకు ఓటేసిన ప్రతి సభ్యుడికీ ఐదు లక్షల రూపాయల వరకూ ముట్టచెబుతానని తెలుగుదేశం తరపు అభ్యర్థి హామీ ఇస్తున్నాడని సమాచారం. ఇందులో మూడు లక్షల రూపాయలను తక్షణం ఇచ్చేలా.. రెండు లక్షల రూపాయలను పోలింగ్ పూర్తి అయిన తర్వాత ఇచ్చేలా హామీలు ఇస్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే.. ఈ జిల్లా కోటాలో ఎమ్మెల్సీ సీటును వైకాపా సునాయాసంగా నెగ్గాలి. అయితే.. వైకాపా తరపున గెలిచిన స్థానిక సంస్థల సభ్యుల ఫిరాయింపుల మీదనే తెలుగుదేశం ఆశలు పెట్టుకుంది. ఇందులో భాగంగా ఓటుకు ఐదులక్షల రేటును చెల్లిస్తున్నారని సమాచారం!

బలంలేని చోట.. అభ్యర్థిని ఎలా నిలుపుతారు? అని తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు జాతీయ మీడియాకు ఎక్కి మరీ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అప్పట్లో బాబు విరుచుకుపడ్డారు. ఏపీలో మాత్రం.. తమకు బలంలేని చోట బాబు అభ్యర్థిని నిలిపి.. ఓటు రేటును పెంచడానికి తన శాయశక్తులా కృషి చేస్తున్నట్టుగా ఉన్నాడు! ఇదీ చంద్రబాబు మార్కు ప్రజాస్వామ్యం!

Show comments