అశ్విన్‌ అన్నాడని కాదుగానీ...

టెస్ట్‌ క్రికెట్‌లో మాత్రమే 'టెక్నిక్‌' కనిపిస్తుంది. అందులో మాత్రమే, కళాత్మక కోణం కనిపిస్తుంది. బ్యాట్స్‌మెన్‌, బౌలర్‌.. 'నువ్వా నేనా' అన్నట్లు మైదానంలో ఒకరితో ఒకరు తలపడతారు. బంతిని బ్యాట్స్‌మెన్‌ టచ్‌ చేయనివ్వకుండా వికెట్లపైకి బంతులు సంధిస్తాడు బౌలర్‌. బౌలర్‌కి వికెట్‌ సమర్పించుకోకుండా వుండేందుకు తన శక్తియుక్తులన్నిటినీ బ్యాట్స్‌మెన్‌ ఉపయోగిస్తాడు. 

పదుల కొద్దీ ఓవర్లు వేసినా బౌలర్‌లో ఉత్సాహం తగ్గదు. బ్యాట్స్‌మెన్‌ గంటల తరబడి క్రీజ్‌లో వున్నా ఏమాత్రం ఉత్సాహం తగ్గినట్లు కన్పించడు. టెస్ట్‌ క్రికెట్‌లో వున్న గ్లామర్‌ అది. అయితే, ఐదు రోజులపాటు మ్యాచ్‌ని తిలకరించాలంటే క్రికెట్‌ అభిమానులకి మాత్రం నీరసమొచ్చేస్తుంది. అలా, వన్డే క్రికెట్‌ ప్రాచుర్యం పొందింది. అందులోంచి మళ్ళీ టీ20 క్రికెట్‌ పుట్టుకొచ్చింది. జస్ట్‌ ఓ సినిమా చూసినట్లు.. మ్యాచ్‌ చాలా తక్కువ టైమ్‌లో పూర్తయిపోతోంది. అందుకేనేమో, సినిమా తరహాలో సినిమా థియేటర్లలో కూడా టీ20 క్రికెట్‌ మ్యాచ్‌లని ఆ మధ్య లైవ్‌గా ప్రసారం చేసేశారు. 

టెస్ట్‌తో పోల్చితే వన్డేల్లో.. వన్డేలతో పోల్చితే టీ20ల్లో బౌలర్ల పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. ఎన్ని టెక్నిక్స్‌ని బౌలర్‌ ఉపయోగించినాసరే, చివరి బ్యాట్స్‌మెన్‌ కూడా సిక్సర్లు బాదేసి, బౌలర్‌ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేస్తున్నాడు. 'ఇరవై ఓవర్లు.. పదకొండు మంది బ్యాట్స్‌మెన్‌..' ఈ ఈక్వేషన్‌తో చితక్కొట్టేస్తున్నారంతే. 

యువరాజ్‌సింగ్‌ ఓ ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన మ్యాచ్‌ గుర్తుంది కదా.? ఆ మ్యాచ్‌ సందర్భంగా బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ కన్నీరుమున్నీరయ్యాడు.. యువరాజ్‌ బ్యాట్‌ కారణంగా చావుదెబ్బ తిన్న ఆవేదనతో. వాస్తవానికి బ్రాడ్‌ చెత్త బౌలర్‌ కాదు.. ఇంగ్లాండ్‌ జట్టులో ప్రధాన బౌలర్‌. కానీ, టైమ్‌ బ్యాడ్‌. యువీ చెలరేగిపోయాడు. ఇలాంటి సందర్భాలు పొట్టి క్రికెట్‌లో చాలానే చూస్తున్నాం. మొన్నటికి మొన్న వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ టీమిండియా బౌలర్లను ఉతికి ఆరేశారు. అఫ్‌కోర్స్‌.. అదే స్థాయిలో మనోళ్ళూ చితక్కొట్టేశారనుకోండి.. ఆ మ్యాచ్‌లో, బౌలర్‌ బిన్నీ తీవ్ర మనోవేదన ఎదుర్కొన్నాడు. ఇక క్రికెట్‌లోకి మళ్ళీ అతనొచ్చే అవకాశాలు తక్కువే. 'అతన్ని తీసుకుని పొరపాటు చేశాం..' అనే భావన టీమిండియాలో కన్పించింది మరి. 

నిన్నటి ఆస్ట్రేలియా - శ్రీలంక జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌పై భారత బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆసక్తికరమైన కామెంట్స్‌ చేశాడు. మ్యాక్స్‌వెల్‌ ఈ మ్యాచ్‌లో చితక్కొట్టేశాడు. 144 పరుగులు చేశాడు ఏకంగా. 'మ్యాక్స్‌వెల్‌కి పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేయాలంటే టెన్నిస్‌ బాల్‌తోనే చెయ్యడం బెటరేమో.. రెండు ఓవర్లు బౌలింగ్‌ మెషీన్‌కి అప్పగిస్తే మంచిది..' అంటూ అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. పొట్టి క్రికెట్‌లో బౌలర్‌ దుస్థితికి అశ్విన్‌ కామెంట్స్‌ నిదర్శనం. 

పొట్టి క్రికెట్‌లోనూ అప్పుడప్పుడూ బౌలింగ్‌ సంచలనాలు నమోదవుతున్నా.. అవీ గాలివాటమే. ఏం చేస్తాం, ఇప్పుడు పొట్టి క్రికెట్‌ ఇస్తున్నంత కిక్‌ వన్డే క్రికెట్‌గానీ, టెస్ట్‌ క్రికెట్‌గానీ ఇవ్వలేకపోతున్నాయి మరి. కళాత్మకత, కమిట్‌మెంట్‌.. ఇలాంటివన్నీ పొట్టి క్రికెట్‌లో మాట్లాడుకోకూడదంతే. సింపుల్‌గా చెప్పాలంటే టెస్ట్‌, వన్డేలు క్లాస్‌ అయితే.. పొట్టి క్రికెట్‌ ఊర మాస్‌.

Show comments