బూతు బాగోతం.. చిలిపి ప్రజా ప్రతినిథి.!

ఓ ప్రజా ప్రతినిథి బూతు బాగోతం ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశమయ్యింది. కర్నాటక అసెంబ్లీలో మంత్రులే బూతు వీడియోలు చూడగా లేనిది, మన తెలుగు నాట.. ఆ స్థాయికి అధికార పార్టీ నేత ఎదగడాన్ని అంత రాద్ధాంతం ఎలా చేస్తారట కామెడీ కాకపోతే.! ఎంతైనా అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథి కదా.. ఏం చేసినా చెల్లిపోతుందని అనుకుని వుంటారు. అధికారంలో వున్నాక, ఆ మాత్రం చిలిపి పనులు చేయకపోతే ఎలా.? 

సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవచ్చుగాక.. ఇంకేమన్నా జరగొచ్చుగాక.. ప్రజా ప్రతినిథుల 'చిలిపి' చేష్టలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. ఇవి చిలిపి చేష్టలు కాదు, వెకిలి చేష్టలు. మామూలుగా అయితే, ఇలాంటోళ్ళను మళ్లీ రాజకీయాల్లో కన్పించనీయకుండా చూడాలి. కానీ, అంత చిత్తశుద్ధి రాజకీయ పార్టీలకెక్కడిది.? 

తాజాగా, టీడీపీ నేత ఒకరు ఈ అశ్లీల బాగోతంలో అడ్డంగా దొరికేశారు. కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ గంగిశెట్టి విజయ్‌కుమార్‌, వాట్సాప్‌ గ్రూప్‌లో అసభ్యకరమైన వీడియో పోస్ట్‌ చేయడంతో వివాదం రాజుకుంది. అధికార పార్టీకి చెందిన మహిళా నేతలే ఈ దారుణంపై భగ్గుమంటుండడం గమనార్హం. అధినేత చంద్రబాబు బావమరిదేమో, అమ్మాయిలు కనపడితే ముద్దులెట్టెయ్యాలి.. వీలైతే కడుపు చేసెయ్యాలి.. అని స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తోంటే.. కిందిస్థాయి నేతలు ఇంకెలా వుంటారట.? ఇదిగో, అచ్చంగా ఇలాగే వుంటారు. 

అశ్లీల బాగోతం కాకపోయినా, సాక్షాత్తూ ఓ మంత్రిగారు ఓ మహిళా ప్రజా ప్రతినిథి కుటుంబాన్ని వేధింపులకు గురిచేయడం అప్పట్లో వివాదాస్పదమయ్యింది. అయినా అప్పట్లో ఆ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన దాఖలాల్లేవు. అంతెందుకు, ఓ మహిళా ఉద్యోగిపై టీడీపీ నేత దాడికి దిగినా, బూతుల పంచాంగం అందుకున్నా.. ఆ ఘటనలో ఆమెదే తప్పని తేల్చిన ఘనుడు చంద్రబాబు. ఇవన్నీ చూశాక, నంద్యాల వాట్సాప్‌ బూతు వీడియో వ్యవహారంపైనా చంద్రబాబు సీరియస్‌గా స్పందిస్తారని అనుకోలేం. 'ఏదో చిలిపి పని చేశాడు.. సరదాగా తీస్కోండమ్మా..' అని సొంత పార్టీకే చెందిన మహిళా ప్రజా ప్రతినిథులకు చంద్రబాబు క్లాస్‌ తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

Show comments