రెంటికి చెడ్డ ర‌వి..

గొట్టిపాటి ర‌వికుమార్‌కు రాజ‌కీయాల్లో క‌ష్ట‌కాలం న‌డుస్తోంది. ఎందుకు రా బాబూ ఈ తెలుగుదేశంలో చేరా అని ప‌శ్చాత్తాపం వెలిబుచ్చే ప‌రిస్థితి ఏర్ప‌డింది. బాబు బూట‌క‌పు హామీలు న‌మ్మి అద్దంకి రాజ‌కీయాల్లో ర‌వి చిత్త‌యిపోయాడు. అటు అధికార పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ అధికారం చెలాయించ‌లేక ఇటు ప్ర‌తిప‌క్ష‌, విప‌క్షాల నుంచి క‌నీస సానుభూతి లేక కుడితిలో ప‌డ్డ ఎలుక మాదిరి కొట్టుమిట్టాడుతున్నాడు.

అద్దంకి రాజ‌కీయాల్లో గొట్టిపాటి కుటుంబం, బ‌ల‌రాం మ‌ధ్య క‌క్ష‌లకు మూడు ద‌శాబ్ధాల చ‌రిత్ర ఉంద‌న్న‌ది మ‌నం గ‌తంలో చెప్పుకున్న విష‌య‌మే. కానీ బాబు ప్ర‌లోభాల‌కు, బూట‌క‌పు హామీల‌కు క‌క్కుర్తి ప‌డి వైసీపీని వీడి అధికార తెలుగుదేశంలో చేరిన గొట్టిపాటి ర‌వికి సీఎం చంద్ర‌బాబు అస‌లైన రాజ‌కీయ రంగు, రుచి, వాస‌న‌, చిక్క‌ద‌నం క‌ళ్ల‌ముందు సాక్షాత్క‌రిస్తోంది. జిల్లా పార్టీ అధ్య‌క్ష స‌మావేశం సంద‌ర్భంగా ఒంగోలులో క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్గీయులు ర‌విపై దాడికి దిగారు. ఎమ్మెల్యే అని కూడా చూడ‌కుండా చొక్కాప‌ట్టుకుని చించి కింద‌ప‌డేసి త‌న్న‌బోయారు.

సొంత పార్టీ వాళ్లే తంతుంటే ఎవ‌రికి చెప్పుకోవాలి పార్టీ అధ్య‌క్షుడికే క‌దా. అందుకే చంద్ర‌బాబును క‌లిసేందుకు అపాయింట్‌మెంట్ కోరితే బాబు బాగా బిజీగా ఉన్నారు మ‌ళ్లీ క‌న‌ప‌డు అని సీఎం పేషీ అధికారులు త‌రిమేశారు. అది బాబు మార్కు రాజ‌కీయం. ఈ సంగ‌తి ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా అర్థ‌మ‌వుతున్న‌ ర‌వి ఇప్పుడేమి చేయాలిరా దేవుడా అంటూ దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయాడు.

మ‌రోవైపు నియోజ‌క‌వ‌ర్గంలో పేరుకు అధికార పార్టీ ఎమ్మెల్యే అనేగానీ ర‌వి చేప్తే వీస‌మెత్తు ప‌నిజ‌ర‌గ‌డం లేదు. అధికారులు, పోలీసులు ర‌వి మాట‌ల‌ను పూచిక‌పుల్ల‌తో స‌మానంగా చూస్తుండ‌డంతో గొట్టిపాటి అనుచ‌రులు తీవ్ర నిరాశ‌లో మునిగిపోయారు. స్థానికంగా తెలుగుదేశం క్యాడ‌ర్ మొత్తం క‌ర‌ణం బ‌ల‌రాం వెంటే న‌డుస్తోంది. అధికారులు, పోలీసులు ఆయ‌న మాట‌కే విలువ ఇస్తున్నారు. దీంతో అటు పార్టీలో చెల్ల‌క‌, ప్ర‌భుత్వంలో గౌర‌వం లేక రెంటికి చెడ్డ‌ రేవ‌డిగా మారిపోయింద ర‌వి ప‌రిస్థితి.

ఇదిలావుంటే వైసీపీ మాత్రం ర‌వికి త‌గిని శాస్తి జ‌రిగిందిలే అని సంబ‌ర‌ప‌డిపోతోంది. పిలిచి పార్టీలో టికెట్ ఇచ్చి బ‌ల‌రాం నుంచి ర‌క్ష‌ణ క‌లిపిస్తే న‌మ్మ‌క ద్రోహం చేసి పోతాడా వాడికి ఇలాగే జ‌ర‌గాలిలే అని ఒక‌ప్ప‌టి స‌హ‌చ‌ర ఎమ్మెల్యేలు కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. 2009 ఎన్నిక‌ల్లో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అద్దంకిలో గొట్టిపాటి ర‌వికి పిలిచి టికెట్ ఇచ్చి ప్రోత్స‌హించారు.  ఆ త‌ర‌వాత 2014 వైసీపీ టికెట్ ఇచ్చి జ‌గ‌న్ మ‌ద్ద‌తు కొన‌సాగించాడు.

Show comments